ఆయ‌న‌పై చ‌ర్య‌లొద్దుః ఏపీ హైకోర్టు

అధికార పార్టీ పెద్ద‌ల్ని దూషించిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు మ‌రోసారి న్యాయ‌స్థానంలో ఊర‌ట పొందారు. గ‌తంలో కూడా ఆయ‌న ముఖ్య‌మంత్రి, మంత్రుల‌పై నోరు పారేసుకోవ‌డం, రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం…

అధికార పార్టీ పెద్ద‌ల్ని దూషించిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు మ‌రోసారి న్యాయ‌స్థానంలో ఊర‌ట పొందారు. గ‌తంలో కూడా ఆయ‌న ముఖ్య‌మంత్రి, మంత్రుల‌పై నోరు పారేసుకోవ‌డం, రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం తెలిసింది. మ‌రోసారి అదే రీతిలో ఆయ‌న‌పై ఎలాంటి దూకుడు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇటీవ‌ల ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ల్ల‌జ‌ర్ల‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అయ్య‌న్న‌పాత్రుడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర దూష‌ణ‌కు పాల్ప‌డ్డారు. దీనిపై అక్క‌డి వైసీపీ నాయ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయ్య‌న్న‌పాత్రుడిపై  న‌ల్ల‌జ‌ర్ల‌లో కేసు న‌మోదైంది. 

రెండు రోజుల క్రితం న‌ల్ల‌జ‌ర్ల పోలీసులు అయ్య‌న్న‌పాత్రుడి ఇంటికెళ్లి నోటీసులు అందించారు. అయ్య‌న్న‌ను అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. దీంతో అయ్య‌న్న‌పాత్రుడి త‌ర‌పు న్యాయ‌వాది హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు అయ్య‌న్న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చింది. అయ్య‌న్న విష‌యంలో ఎలాంటి దూకుడు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో పోలీసుల చేతులు క‌ట్టేసిన‌ట్టైంది. అయ్య‌న్న నోటి దురుసును అధికార పార్టీ అడ్డుకోలేర‌ని మ‌రోసారి రుజువైంది.