అటు అంబానీ ఇటు ఆదానీ…..సమ్మిట్ అదుర్స్

విశాఖలో అరుదైన ఘట్టానికి తెర లేచింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు అందాల సాగరతీరం ముస్తాబు అయింది. విభజన ఏపీలోనే కాదు దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. కార్పోరేట్…

విశాఖలో అరుదైన ఘట్టానికి తెర లేచింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు అందాల సాగరతీరం ముస్తాబు అయింది. విభజన ఏపీలోనే కాదు దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. కార్పోరేట్ బిగ్ షాట్స్ అంతా విశాఖకు వచ్చి విడిది చేయనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఇరవై అయిదు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, హై కమిషనర్స్ పాల్గొంటున్నారు.

దేశంలో చూసుకుంటే ముప్పయి అయిదు మంది టాప్ రేంజి పారిశ్రామికవేత్తలు పాలు పంచుకుంటున్నారు. వైసీపీ నాలుగేళ్ళ తన పాలనానుభవాన్ని శక్తిని విజన్ని కూడగట్టుకుని నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఈ సదస్సు ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్తుకుంది.

ఈ సదస్సుకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే పన్నెండు వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే అనూహ్యమైన ఆదరణ దక్కినట్లే అని ప్రభుత్వ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సదస్సుకు వచ్చే అతిధుల కోసం విశాఖలోని మొత్తం హొటెల్స్ అన్నీ జిల్లా అధికారులు బుక్ చేసేశారు. రెండవ తేదీ నుంచి అయిదవ తేదీ వరకూ మూడు రోజుల పాటు కార్పోరేట్ హొటల్స్ తో సహా అన్ని స్టార్ హొటల్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డు కనిపిస్తుంది అంటున్నారు.

సమ్మిట్ కి వచ్చే అథిదుల కోసం ప్రభుత్వం అద్భుతమైన వసతితో పాటు రవాణా సదుపాయాలను సమకూరుస్తోంది. అటు అంబానీ ఇటు ఆదానీ సహా మిట్టల్, ఆదిత్య బిర్లా, బజాజ్, జీఎమ్మార్ వంటి బిగ్ షాట్ ప్రత్యేక విమానాలతో విశాఖ రావడం మరో అరుదైన ముచ్చటగా చెబుతున్నారు.

విశాఖకు సమ్మిట్ కోసం వచ్చే వీఐపీలు అక్షరాలా ఎనిమిది వందల మందికి పై మాటేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వారి కోసం లగ్జరీ కార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ అంతటా ఇపుడు భద్రతావలయంలోకి వెళ్ళిపోయింది. రెండు వేల అయిదు వందల మంది పోలీసులతో రెప్ప వాల్చని విధంగా నిఘని పెట్టారు. గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు.

విశాఖలో జరుగుతున్న సమ్మిట్ కోసం వచ్చే కేంద్ర మంత్రులు వీఐపీలకు ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు ఉంటాయని అధికారులు తెలియచేశారు. సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కి కేంద్ర మంత్రులను ప్రత్యేక హెలికాప్టర్లలో విడిది నుంచి తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్టగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ఏపీ దశ దిశ మారుతుందని మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. విశాఖ ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.