రాజకీయ నాయకులు యాక్టివ్ అవడం అంటే ప్రత్యర్ధి పార్టీలను విమర్శించడమే. ఆ విషయంలో చాలా కాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఎంత సైలెంట్ అంటే ఒక దశలో ఆయన పార్టీలు మారుతారు అని ప్రచారం వచ్చినా ఖండించనంతగా మౌనవ్రతం పాటించారు.
టీడీపీ ఓడిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఏపీ రాజకీయాల మీద క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే టీడీపీలో చినబాబు లోకేష్ ని కలసివచ్చారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను రీ యాక్టివ్ అవున్నా అని చెప్పారు. తెలుగుదేశాన్ని వీడిపోలేదు, వదిలేది లేదు అని స్పష్టం చేశారు.
అది జరిగిన తరువాత కూడా మళ్ళీ కొన్నాళ్ళు మౌనం పాటించిన గంటా విశాఖలో వైసీపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న వేళ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అంటూ ఒక లేఖ సంధించారు. ఆ లేఖలో ఇవి తన సందేహాలు కాదు, ఏపీలో సగటు పౌరుడికి వచ్చిన డౌట్లు అని చెప్పుకున్నారు.
నాలుగేళ్ళు ఆగి ఇపుడే ఎందుకు సమ్మిట్ అని హడావుడి చేస్తున్నారు అని గంటా అడుగుతున్నారు. దావోస్ కి వెళ్ళకుండా విశాఖలో పెట్టుబడుల సదస్సు ఏంటి అని మరో ప్రశ్న వేశారు. టీడీపీలో హయాంలో పారిశ్రామిక ప్రగతి పచ్చగా ఉంటే ఇపుడు ఏమీ లేదని పసుపు పార్టీ నేత మాదిరిగా ఆవేదన చెందారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పెట్టుబడిదారులలో ఎలా విశ్వాసం పెంపొందిస్తుందని మరో డౌట్ అడిగారు.
ఇలా గంటా తాను టీడీపీ తరఫున యాక్టివ్ అయ్యాను అని గట్టిగా చెప్పేందుకు లేఖ రూపంలో ప్రశ్నలను చాలా వదిలారు. అయితే ఈ లేఖకు వైసీపీ మంత్రి గుడివాడ ఇచ్చిన సమాధానం కూడా వెరైటీగానే ఉంది. చంద్రబాబు రాసిన లేఖకు గంటా సంతకం పెట్టారు అంటూ సెటైర్లు వేసిన మంత్రి కడుపు మంటతో రాసిన లేఖ ఇది అని విమర్శించారు.
ఏపీకి రాజధాని లేదని అంటున్నారు అంటే ఉమ్మడి ఏపీ నుంచి పారిపోయి వచ్చి అమరావతి పేరిట ఏమీ కాకుండా చేసిన పాపం అంతా చంద్రబాబుదే అని గుడివాడ అంటున్నారు. దావోస్ కి వెళ్తేనే పెట్టుబడులు తెచ్చినట్లా. అలా అయితే మీరెన్ని తెచ్చారు అని గంటాకే సూటిగా ప్రశ్నించారు. అక్కడకు వచ్చిన కార్పోరేట్ దిగ్గజాలే ఏపీకి వస్తూంటే మళ్లీ దావోస్ కి వెళ్లలేదు అనడంలో అర్ధమే లేదు గంటా వారూ అని కౌంటర్ ఇచ్చారు.
ఇక పెట్టుబడుల సదస్సు ఫలానా టైంలోనే నిర్వహించాలని ఏమైనా ఉందా గంటా గారూ అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎపుడు వచ్చాం కాదన్నయా ఏమి తెచ్చామన్నది ముఖ్యమని పోకిరి లో మహేష్ డైలాగు నే వైసీపీ నేతలు గంటాకు అప్పచెబుతున్నారు. అంతా ఆర్భాటం హడావుడి చేసి అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ మాదిరిగా మా పెట్టుబడుల సదస్సు ఉండదని మేము రెండు లక్షల కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నాం, అదృష్టం బాగుంటే ఆ నంబర్ అయిదు పది లక్షల కోట్లకు చేరినా చేరవచ్చి ఇదే మా నమ్మకం అని గంటాకు సరైన జవాబే చెబుతున్నారు గుడివాడ.