బీసీసీఐ త‌వ్విన గోతిలో టీమిండియా!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు దాదాపు ఓట‌మికి ప్రిపేర్ కావాల్సిందేనేమో! మ‌రీ అద్బుతం జ‌రిగితే త‌ప్ప ఈ మ్యాచ్ లో బార‌త…

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు దాదాపు ఓట‌మికి ప్రిపేర్ కావాల్సిందేనేమో! మ‌రీ అద్బుతం జ‌రిగితే త‌ప్ప ఈ మ్యాచ్ లో బార‌త జ‌ట్టు గెలిచే అవ‌కాశాలు లేవు. మూడు రోజుల ఆట మిగిలే ఉన్న స‌మ‌యానికి ఆస్ట్రేలియా ముందు 76 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్ర‌మే ఉంచ‌గ‌లిగింది టీమిండియా! తొలి ఇన్నింగ్స్ లో కేవ‌లం 109 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన భార‌త జ‌ట్టు, రెండో ఇన్నింగ్స్ లో కూడా పెద్ద పోరాట ప‌టిమ‌ను చూప‌లేదు. 163 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 197 ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు కీల‌క‌మైన ఆధిక్యాన్ని అప్పుడే సాధించింది. 76 ప‌రుగుల ల‌క్ష్యం మాత్ర‌మే ఆ జ‌ట్టు ముందు ఉంది.

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డ‌ర్ ఆట‌తీరును గ‌మ‌నిస్తే.. ఆ జ‌ట్టుకు ఇదేమీ భారీ ప‌రుగుల లక్ష్యం కాదు! భార‌త స్పిన్న‌ర్లు అత్య‌ద్భుతం చేస్తే త‌ప్ప ఆ జ‌ట్టును 75 ప‌రుగుల్లోపు ఆలౌట్ చేయ‌డం సాధ్యం కాదు!  మ్యాచ్ ఫ‌లితం సంగ‌తెలా ఉన్నా.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను ఆట‌క‌ట్టించ‌డానికి అన్న‌ట్టుగా స్నిన్న‌ర్ల‌కు తొలి ఓవ‌ర్ నుంచినే ప‌ట్టు ద‌క్కే పిచ్ ల‌ను రూపొందిస్తున్న భార‌త క్రికెట్ జ‌ట్టు యాజ‌మాన్యం త‌ను ప‌న్నిన ఉచ్చులో త‌నే చిక్కుకున్న‌ట్టుగా ఉందిప్పుడు!

ఇప్ప‌టికే తొలి రెండు టెస్టులూ మూడో రోజు ఆట పూర్తి కాకుండానే ఫ‌లితం వ‌చ్చాయి! మూడో టెస్టు ఫ‌లితం ఏదైనా.. మూడో రోజు లంచ్ లోపే అయిపోతుంది! షెడ్యూల్ లో ఈ మ్యాచ్ లకు ఐదు రోజులు ఇచ్చారు! బ‌హుశా ఇలాంటి పిచ్ ల‌ను త‌యారు చేసే ఉద్ధేశంతో మూడు రోజుల మ్యాచ్ లుగా వీటిని ప్ర‌క‌టించి ఉంటే పోయేదేమో! 

తొలి రోజే దుమ్ము లేచే ట్రాక్ ల‌ను త‌యారు చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థులు కూడా స్పిన్న‌ర్ల‌ను త‌యారు చేసుకుంటున్నారు! ఇది వ‌ర‌కూ ఇంగ్లండ్ జ‌ట్టు ఇండియాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా ఒక టెస్టులో ఇలాగే జ‌రిగింది. ఆ సీరిస్ ఆసాంతం.. రూట్ వంటి పార్ట్ టైమ్ బౌల‌ర్ కూడా ఒక్క ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్ల‌ను తీశాడు! ఇప్పుడు ఆస్ట్రేలియా స్పిన్న‌ర్లు కూడా భార‌త బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోహిత్, కొహ్లీ, పుజారా వంటి సీనియ‌ర్లు కూడా కాసిన్ని ప‌రుగులు చేయ‌డానికి విల‌విల్లాడుతున్నారు! ఇక మిగ‌తా వాళ్ల సంగ‌తి స‌రేస‌రి!

మ‌నోళ్ల బ్యాటింగ్ చూస్తే.. వీళ్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాల్లో కూడా ఇంత‌క‌న్నా మెరుగ్గా బ్యాటింగ్ చేశార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్వ‌దేశీ పులులుగా పేరున్న భారత బ్యాట్స్ మెన్ విదేశాల్లో పులుల్లా విజృంభిస్తున్న ద‌శ‌లో వారిని స్వ‌దేశంలో పిల్లులుగా మార్చింది బీసీసీఐ నిర్వాకం. స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా త‌యారు చేసేస్తే విజ‌యం ఖాయ‌మ‌నే లెక్క‌ల‌తో సొంత బ్యాట్స్ మెన్ల ఆత్మ‌విశ్వాసాన్ని కూడా బీసీసీఐ విజ‌య‌వంతంగా దెబ్బ‌తీస్తున్న‌ట్టుగా ఉంది!