ఒకే రోజున ఒకే హీరోతో 9 సినిమాలకు ఒకే షాట్ తో క్లాప్ కొట్టడం.. బహుశా ప్రపంచ సినీ చలన చిత్ర చరిత్రలో ఒకేసారి జరిగిన ఫీట్ అది. ఒకే రోజున రెండు సినిమాలకు కొబ్బరి కాయ కొట్టిన హీరోలు, ఒకే రోజున తమ సినిమాలు రెండింటిని విడుదల చేసిన హీరోలు కూడా ఉన్నారు! అయితే ఒకే రోజున ఏకంగా ఇలా తొమ్మిది సినిమాలను ప్రారంభించిన హీరోల్లో ఒక్క తారకరత్నకు తప్ప మరొకరికి చోటు దక్కలేదు ఇంత వరకూ!
ఒకవైపు సినిమాల్లో వారసుల ప్రమోషన్ గట్టిగా సాగుతున్న సమయం అది. ఉషా కిరణ్ బ్యానర్ పై రామోజీ రావు కేవలం సినీ వారసులతో సినిమాలు చేయడానికన్నట్టుగా సినిమాలు చేశారు ఆ సమయంలో! చిన్నా పెద్ద తేడా లేకుండా.. వారసులందరితో ఉషా కిరణ్ సినిమాలు వచ్చేవి. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్, రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్, ఎస్పీ బాలూ తనయుడు చరణ్, గాయకుడు రామకృష్ణ తనయుడు సాయి కిరణ్, ఇంకా తరుణ్.. ఇలా సినీ కుటుంబాల వాళ్లు హీరోలుగా సినిమాలు రావడమే ట్రెండ్!
కేవలం రామోజీ రావే కాదు.. బయటి నిర్మాతలు కూడా ఇలాంటి వారిని వేటాడారు. ఈ తరహాలో తారకరత్నకు కూడా యమ డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ అయిపోయాడు, ఎన్టీఆర్ మనవడు అంటే మార్కెట్ పై నిర్మాతలకు ఆశ ఏర్పడింది. దీంతో తారక్ వెంట ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది నిర్మాతలు పడ్డట్టున్నారు. ఇక ఆ సినిమాలకు దర్శకులు కూడా పేరున్న వాళ్లే!
రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే రాసిన, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఒకటో నంబర్ కుర్రాడు, ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన యువరత్న, ఇంకో సినిమా తారక్. ఈ మూడే ఈ హీరో సినిమాల్లో కాస్త సవ్యంగా విడుదల అయ్యాయి. తొమ్మిది సినిమాల ఆరంభంతో వార్తల్లో నిలిచిన తారకరత్న విషయంలో ఆ సినిమాలు అన్నీ పూర్తి కాలేదు. ఒకటో నంబర్ కుర్రాడు మ్యూజికల్ గా హిట్ అయ్యింది. ఇంటర్, డిగ్రీ పిల్లలు ఆ సినిమా పట్ల ఆసక్తి చూపించారు.
ఇక యువరత్న కూడా ఇతడికి హిట్ ను ఇవ్వలేకపోయింది. వెంటనే తారక్ విడుదలైంది. ఈ మూడు సినిమాలతో తారకరత్న నిలదొక్కుకోలేకపోయాడు. ప్రారంభం అయిన సినిమాలు ఊసులో లేకుండా పోయాయి. జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ డమ్ వచ్చింది. కల్యాణ్ రామ్ ను రామోజీ బ్యానర్ పరిచయం చేసింది. దీంతో తారకరత్నపై నందమూరి వీరాభిమానుల దృష్టి కూడా తగ్గింది. భద్రాద్రిరాముడు అంటూ ఒక సినిమాలో విపరీత స్థాయిలో ఎన్టీఆర్ పేరును స్మరించారు. అయినా హిట్ దక్కలేదు.
2002లో తారకరత్న తొలి సినిమా విడుదల అయితే, 2005 నాటికి ఇతడి సినిమాలు విడుదల్లేకుండా పోయాయి. మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు రఘుబాబు *అమరావతి* సినిమాతో తారక్ కు చెప్పుకోదగిన బ్రేక్ ను ఇచ్చాడు. ఆ తర్వాత తారక్ మళ్లీ నటుడుగా పలు సినిమాలను చేయగలిగాడు.
ఎదురులేని అలెగ్జాండర్, రాజా చెయ్యి వేస్తే వంటి టైటిల్స్ ఆసక్తిని రేపాయి. అయితే తారకరత్నకు హీరోగా కానీ, పూర్తి స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కానీ సరైన బెంచ్ మార్క్ హిట్ దక్కలేదు. అబ్బుర స్థాయిలో దక్కిన ఆరంభం తారకరత్న కెరీర్ ను మలచలేదు! నట వారసుల్లో సక్సెస్ అయిన వారంతా ప్రతిభావంతులూ కాదు, తారకరత్నను ప్రతిభావంతుడు కాదనీ అనలేం. రుద్దగా రుద్దగా కొందరు స్టార్లు అయ్యారు. తారకరత్నకు అలాంటి అవకాశాలు లభించలేదంతే!