ఇండియాలో టెస్టు క్రికెట్ అంటే ఒకప్పుడు మంచి మజా ఉండేది. చివరి రోజు వరకూ మ్యాచ్ లు సాగడం రివాజే. ఇండియాలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి క్రికెట్ జట్లు పర్యటించినప్పుడు అయినా.. ఇంకా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లు కూడా లు కూడా కొంత వరకూ పోటీ ఇవ్వగలిగేవి. 2001లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ లు ఇప్పటికీ మరపురానివిగా నిలుస్తాయి. ఆ తర్వాత పాకిస్తాన్ తో ఇండియా టెస్టు మ్యాచ్ లు కూడా రసవత్తరంగానే సాగాయి. ఇంకా ఓడిపోయినప్పటికీ.. కొన్నేళ్ల కిందట దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ హషీం ఆమ్లా- డివిలియర్స్ లు అద్బుత పోరాట పటిమితో ఆడారు.
అయితే ఎప్పుడైతే ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ను అనౌన్స్ చేసిందో, అప్పటి నుంచి టెస్టు క్రికెట్ ప్రమాణాలు మరింత దారుణంగా పడిపోయినట్టున్నాయి. ఈ పాయింట్స్ కోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు అనువైన పిచ్ ల రూపకల్పనకు మరింత ప్రాధాన్యతను పెంచాయి. ఇదేమీ కొత్తది కాకపోయినప్పటికీ… ఇటీవలి ఆస్ట్రేలియాలో జరిగిన ఆసీస్- సౌతాఫ్రికా టెస్టు సీరిస్ ను గమనించినా, కొంతకాలం కిందట ఇండియాలో ఇంగ్లండ్ పర్యటించినప్పుడు బీసీసీఐ రూపొందించిన పిచ్ లను గమనించినా, తాజాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో రెండు, రెండున్నర రోజులకే ముగిసిపోతున్న టెస్టులను గమనించినా.. అంతా కలిసి టెస్టు క్రికెట్ ను చంపేయడానికి బోర్డులు, ఐసీసీ కంకణం కట్టుకున్నాయని స్పష్టం అవుతోంది.
చివరిసారి ఇండియాలో ఒక టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగి ఎంతకాలం అయ్యిందంటే.. సమాధానం కోసం క్రికెట్ ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ కూడా తడుముకోవాల్సిందే! గూగుల్ ను ఆశ్రయించాల్సిందే!
గతంలో ఇండియా పిచ్ లు అంటే.. చివరి రెండు రోజులూ స్పిన్నర్లకు స్వర్గధామం అనిపించుకున్నాయి. ఫలితంగా ఫలితం రావనుకున్న మ్యాచ్ లు కూడా ఆఖరి రోజున థ్రిల్లర్లుగా మారేవి! తొలి రెండు రోజులూ ఫ్లాట్ గా అనిపించే పిచ్ లు ఉండేవి. తొలి మూడు రోజులూ బ్యాటింగ్ కు, చివరి రెండు రోజులూ.. ఇంకా ఐదో రోజు ఆఖరి సెషన్ లో బౌలింగ్ కు అనుకూలంగా నిలుస్తూ రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి!
నాగ్ పూర్ వంటి పిచ్ లు ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కు కూడా అనుకూలంగా ఉండేవి! అయితే ఇప్పుడు తొలి రోజు తొలి సెషన్ లో ఏడో ఓవరో ఎనిమిదో ఓవరో స్పిన్నర్ లకు బంతిని ఇస్తున్నారు భారత క్రికెట్ జట్టు కెప్టెన్లు! ఏదో నామమాత్రంగా.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను పెట్టుకున్నారు. వారి కొత్త బంతితో వికెట్ దక్కినా దక్కకపోయినా.. ఎనిమిదో ఓవర్ తో స్పిన్నర్ రంగంలోకి దిగాల్సిందే!
మూడో రోజుకు కానీ టర్న్ దొరకప్పుడు మ్యాచ్ లు ఐదు రోజుల పాటు జరిగాయి. అయితే ఇప్పుడు తొలి రోజే బంతి గిర్రున తిరుగుతుంది. దీంతో రెండున్నర రోజులకు మ్యాచ్ ఖతం! ఇంక ఈ మాత్రం దానికి ఐదు రోజుల పేరుతో టెస్టులెందుకు? ఇలా గెలిచేసి భుజాలు చరుచుకోవాలా!
చివరి సారి ఇండియా పిచ్ ల మీద మ్యాచ్ డ్రా ఎప్పుడైంది? వర్షం కారణం తప్పించి, ఏవైనా మ్యాచ్ లు పోటాపోటీగా జరుతున్నాయా? టెస్టు క్రికెట్ లో పోటాపోటీగా జరిగి డ్రా అయిన మ్యాచ్ లు కూడా క్లాసిక్సే! అయితే ఆతిథ్య జట్లకు తొలి రోజే పగుళ్లతో కూడిన పిచ్ లను చూపిస్తూ.. వారిని ఆదిలోనే జావ కార్చేస్తే… ఇక పోరాటం ఎక్కడుంటుంది? అదేమంటే.. పిచ్ ల గురించి ప్రశ్నించవద్దని, ఆస్ట్రేలియాకు టీమిండియా వెళ్లినప్పుడు అక్కడ బౌన్సీ పిచ్ లు ఉంటాయని, ఏ దేశం బోర్డు ఆ జట్టుకు అనుగుణంగా పిచ్ లను తయారు చేసుకోవడం మామూలే అని వాదిస్తారు, లేదా ఎదురుదాడి చేస్తారు! అయితే.. ఇండియాలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న టెస్టు మ్యాచ్ ల్లో టీమిండియా ఘన విజయాలు సాధిస్తే సాధించవచ్చు కానీ.. ఇవేవీ గతం తాలూకు ఆనందాన్ని ఫ్యాన్స్ కు ఇవ్వడం లేదు.
అంతే కాదు.. గతంలో గవాస్కర్, సచిన్, ద్రావిడ్ వంటి వాళ్లు టెస్టుల్లో భారీ ఇన్నింగ్స్ లు, లక్ష్మణ్ మరపురాని ఇన్నింగ్స్.. ఇవన్నీ నమోదయ్యాయంటే కూడా నాటి పిచ్ లు కూడా బ్యాట్స్ మన్ కు ఎంతో కొంత అనుకూలంగా నిలవడం ఒక కారణం!
ప్రస్తుత ఇండియా- ఆసీస్ సీరిస్ లో రెండు మ్యాచ్ లకు గానూ ఇప్పటి వరకూ ఒక్క సెంచరీ నమోదైంది! భారత బ్యాట్స్ మెన్ కూడా పట్టుమని పది పరుగులు చేయడానికి అపసోపాలు పడుతున్నారు! అవతలి జట్టు కూడా ముగ్గురు స్పిన్నర్ల ను పెట్టుకుని ఆడుతోంది. మనోళ్లు అవతలి జట్టుతో పోలిస్తే కొద్దిగా మాత్రమే బెటర్ గా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. డిల్లీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఒక పరుగు ఆధిక్యం సాధించింది. అలాగే 115 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్ మెన్ మంచినీళ్ల ప్రాయంగా చేధించలేదు. అంటే ఇండియాలో ఇక బ్యాట్స్ మెన్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధించడమూ తేలిక కాదు!
గతంలో టెస్టు మ్యాచ్ లు అంటే సెంచరీల మోత మోగేది. ఇండియా పిచ్ లపై బోలెడంత మంది బౌలర్లు కూడా సెంచరీలను సాధించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు స్టార్ బ్యాట్స్ మెన్లకు కూడా అది తేలిక కావడం లేదు. తొలి రోజు నుంచినే బంతి తిరుగుతుంది. 250 ఓవర్లు పడకముందే నాలుగు ఇన్నింగ్స్ లూ అయిపోతాయి! టెస్టు క్రికెట్ పై ఫ్యాన్స్ లో ఏమీ ఆసక్తి తగ్గలేదు. టెస్టు క్రికెట్ ను చంపడానికి బోర్డులే ఇలాంటి పిచ్ వ్యూహాలను పన్నుతున్నట్టుగా ఉన్నాయి! ఆఖరికి పరిస్థితి ఎలా తయారవుతోందంటే.. ఇండియా జట్టు ఇండియాలో టెస్టులు ఆడితే టీవీలో వీక్షించే వారు తగ్గిపోతున్నారు. అదే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలకు ఇండియా వెళ్లి టెస్టులు ఆడితే.. పోటాపోటీ పరిస్థితి ఉంటుందనే ఆశతో ఆటను వీక్షించే వారు ఎక్కువగా ఉన్నారు. ఆట అంటే పోటీ ఉండాలి కానీ, వన్ సైడెడ్ కండీషన్స్ ఆటపై నిరాదరణనే పెంపొందిస్తాయి!