కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. ఇకపై భార్యాభర్తలు

మొన్నటివరకు కేవలం సహ నటీనటులు, ఆ తర్వాత ప్రేమికులు, ఇప్పుడు ఏకంగా భార్యాభర్తలు. హాట్ బ్యూటీ కత్రినాకైఫ్, హీరో విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొలిసారి…

మొన్నటివరకు కేవలం సహ నటీనటులు, ఆ తర్వాత ప్రేమికులు, ఇప్పుడు ఏకంగా భార్యాభర్తలు. హాట్ బ్యూటీ కత్రినాకైఫ్, హీరో విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తొలిసారి తన పెళ్లిపై కత్రినా కైఫ్ స్పందించింది. మేమిద్దరం కలిసి జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించామని, అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలంటూ తన పెళ్లి ఫొటోలు పెట్టింది.

అదే టైమ్ లో విక్కీ కౌశల్ కూడా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు. ప్రేమంచుకున్నప్పుడు, పెళ్లికి సిద్ధమైనప్పుడు, పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు, ఒక్కసారి కూడా స్పందించని ఈ జంట.. పెళ్లి తర్వాత మాత్రం ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వీళ్ల పెళ్లిపై ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న బాలీవుడ్ ప్రముఖులంతా.. కత్రిన అధికారిక ప్రకటన తర్వాత శుభాకాంక్షలు తెలిపారు.

రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట బర్వారాలో నిన్న కత్రినా-విక్కీ పెళ్లి ఘనంగా జరిగింది. దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, జాన్వి కపూర్, హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, సారా అలీఖాన్, పరిణీతి చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న అలియాభట్ కూడా పెళ్లికి హాజరైంది. ముంబయిలో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే, ఆమె అట్నుంచి అటు పెళ్లికి వెళ్లింది.

ఈరోజు కూడా ఫోర్ట్ బర్వారా రిసార్ట్ లోనే ఉండబోతున్నారు కత్రినా-విక్కీ. ముంబయి వచ్చిన తర్వాత మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇవ్వాలని ఈ జంట నిర్ణయించింది. పెళ్లి దుస్తుల్లో కత్రినాకైఫ్ మెరిసింది. ఆమె ధరించిన దుస్తులు, వేసుకున్న నగలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.