గంటా పరువు తీసిన అయ్యన్న..!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, దాన్ని ఆమోదించుకునే దిశగా ఓసారి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిని కూడా కలిశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు.…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, దాన్ని ఆమోదించుకునే దిశగా ఓసారి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిని కూడా కలిశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. మరోవైపు వైసీపీ కండువా కప్పుకోడానికి ఉత్సాహపడ్డా విజయసాయిరెడ్డి రూపంలో ఆయనకి ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. 

ప్రస్తుతానికి ఆయన టీడీపీలో ఉన్నా లేనట్టే. ఏదో మొక్కుబడిగా చంద్రబాబు ఫొటోలతో పండగలకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టింగ్ లు పెడుతుంటారు కానీ.. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఏ కార్యక్రమాలకూ హాజరు కావడం లేదు. చివరికి చంద్రబాబు పెట్టే అధికారిక సమావేశాలకు కూడా.

చంద్రబాబుకే షాక్..

చంద్రబాబుకి ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులిస్తుంటారు గంటా శ్రీనివాసరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ అలర్ట్ కాకముందే గంటా రాజీనామా డ్రామా ఆడి రక్తి కట్టించాలనుకున్నారు. ప్రతిపక్షం చేస్తున్న ఏ పోరాటానికీ గంటా మద్దతు ఉండదు. పోనీ తనకు తాను ఏదైనా కొత్త అజెండాతో వెళ్తున్నారా అంటే అదీ లేదు. 

చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భంలో మిగతా నాయకులంతా రియాక్ట్ అయినా, గంటాలో మాత్రం చలనం లేదు. అసలింతకీ ఇప్పుడు గంటా ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. స్వయానా ఆ పార్టీ కీలక నేత గంటా టీడీపీలో ఉన్నారా, లేరా అనే సందిగ్ధంలో పడ్డారు.

గంటా పార్టీలో లేరా..? డౌటొచ్చింది..

ఉత్తరాంధ్రలో గంటా వర్గంతో అయ్యన్నపాత్రుడికి విభేదాలున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆయనెప్పుడూ నేరుగా తన అసంతృప్తిని బయటపెట్టలేదు. ఇంటర్నల్ ఫైట్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. తాజాగా ఓ టీవీ కార్యక్రమానికి కొడుకు విజయ్ తో కలసి వచ్చిన అయ్యన్న ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ గంటా పరువు తీశారు.

గంటా ఇంకా పార్టీలోనే ఉన్నారా అని ఏబీఎన్ రాధాకృష్ణ అడిగారు. దానికి అయ్యన్న.. లేరా అండీ.. మీరు ఉన్నారా అంటే నాకు అనుమానం వచ్చింది అనేశారు. ఆ తర్వాత గంటాకి హార్ట్ ఆపరేషన్ జరిగిందని, అందుకే కాస్త దూరంగా ఉంటున్నారని కవర్ చేసినా.. గంటాపై అయ్యన్న వేసిన సెటైర్ మాత్రం పేలింది. మొత్తమ్మీద కావాలనే గంటా పేరుని ఆర్కే ప్రస్తావించడం, అయ్యన్న కౌంటర్ వేయడంతో గంటా వర్గం రగిలిపోతోంది.

ఇంతకీ గంటా ఏమయ్యారు..?

పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనట్లేదు, పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోవట్లేదు. విశాఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత జగన్ నిర్ణయాన్ని స్వాగతించి అప్పట్లో పెద్ద సంచలనమే రేపారు గంటా. ఆ తర్వాత వైసీపీకి దగ్గరవ్వాలని చూసినా అది కుదరలేదు. దీంతో అటు టీడీపీతో పూర్తిగా సంబంధాలను తెంచుకోకుండా, ఇటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా గోడ మీద పిల్లి వాటంలో ఉన్నారు. ప్రస్తుతానికి కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు.

ఇలాంటి వారికి పొగబెట్టడంలో చంద్రబాబు బాగా దిట్ట. అందుకే ఇలా ఆర్కే ఇంటర్వ్యూతో గంటా వర్గానికి కాక పుట్టించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందులోనూ గంటాపై సెటైర్ వేసింది మరెవరో కాదు.. ఆయన బద్ధ శత్రువు అయ్యన్నపాత్రుడు. దీంతో గంటా వర్గం రగిలిపోతోంది. కావాలనే తమని టార్గెట్ చేశారని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు మాత్రం ఈ ఎపిసోడ్ తో సంబరపడిపోతున్నారు.