బిగ్‌బాస్ సీజన్-5 నుంచి ఎలిమినేట్ అయిన పింకీ అలియాస్ ప్రియాంక సింగ్… పోతూపోతూ మనసులో మాటను బయట పెట్టింది. ముఖ్యంగా మానస్ విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. నిజానికి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి పోవడం కంటే మానస్ నుంచి దూరమవుతున్నందుకు ఆమె తెగ బాధ పడినట్టు కనిపించింది.
బిగ్‌బాస్ హౌస్‌లో మానస్, ప్రియాంక మధ్య సాన్నిహిత్యం గురించి బహిరంగ రహస్యమే. హోస్ట్ నాగార్జున సూచనతో ప్రియాంక విషయంలో మానస్ కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తనను బలంగా ప్రేమిస్తోందని అభిప్రాయానికి వచ్చిన మానస్, తనకు ఆ అభిప్రాయం లేదని చెప్పేందుకు ఒక దశలో ఆమె మనసును నొప్పించడానికి కూడా వెనుకాడలేదు.
తన నుంచి ఏదో ఆశిస్తున్నావని పదేపదే ప్రియాంకతో మానస్ అన్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో హౌస్ నుంచి బయటి కొచ్చిన ప్రియాంక… వేదికపై నాగార్జున సాక్షిగా ఒక్కొ కంటెస్టెంట్‌పై తనవైన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పింది. మానస్ దగ్గరికి వచ్చే సరికి ప్రేమనే కాదు, కన్నీళ్లను కూడా ఆపుకోలేకపోయింది.
హౌస్‌లో అడుగు పెట్టగానే మానస్ చూడగానే ఎవరీ సిల్కీ హెయిర్ అబ్బాయి అనుకున్నట్టు సరదాగా చెప్పింది. మొదట పలకరించగానే మానస్ ఏమీ మాట్లాడలేదని వాపోయింది. ఎంత పొగరు అనుకున్నానని పేర్కొంది. ఆ తర్వాత తమ మధ్య నెమ్మదిగా స్నేహం ఏర్పడిందని చెప్పింది.
ఎప్పుడూ ఏదో ఆశిస్తున్నావని మానస్ అంటుంటారని, తాను ఏం ఆశించింది ఏంటో చెబుతానని పేర్కొంది. ‘నువ్వు బాగా ఆడాలి. నీ నుంచి నేను అదే ఆశిస్తున్నా. విన్నర్‌గా చూడాలనుకుంటున్నా’ అని ప్రియాంక మనసులో మాట బయటపెట్టి… మానస్‌తో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా ఆమె గెలుచుకుంది.