జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌ను యంగ్ హీరో ఎన్టీఆర్ తాజా ఎపిసోడ్ హెచ్చరిస్తోంది. తన మేనత్త నారా భువనేశ్వరిపై వైసీపీతో పాటు సొంత పార్టీ రెబల్ ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరక భాషలో దూషిస్తే… జూనియర్ ఎన్టీఆర్ ప్రవచనాలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారని టీడీపీ ముఖ్యనేతలు ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
భువనేశ్వరిపై అవాకులు చెవాకులు పేలారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ… ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులని, వాళ్లని ఎందుకు గట్టిగా హెచ్చరించలేదని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు నుంచి పవన్‌కల్యాణ్ గుణపాఠం నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన కుమారుడు లోకేశ్‌కు భవిష్యత్‌కు ఎన్టీఆర్ నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన చంద్రబాబు… ఓ పథకం ప్రకారం అతన్ని దూరం చేయాలనే ఎత్తుగడలో భాగంగా విమర్శలు గుప్పిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ వారసుడిగా యంగ్ హీరో ఎన్టీఆర్‌కు పార్టీతో ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు చంద్రబాబు చేస్తున్న కుట్రల నుంచి పవన్‌కల్యాణ్ ఎంతైనా నేర్చుకోవచ్చని అంటున్నారు. మేనల్లుడైన ఎన్టీఆర్‌ను ప్రేమించకపోగా… విషం చిమ్మేలా సొంత పార్టీ నేతలతో విమర్శలు గుప్పించడం దేనికి సంకేతమో పవన్ గ్రహించాలని కోరుతున్నారు.
దివంగత ఎన్టీఆర్ వారసుడికే టీడీపీలో దిక్కు లేకుంటే, తనపై చంద్రబాబు కనబరుస్తున్న ప్రేమలో నిజాయితీ ఉందని పవన్ ఏ విధంగా నమ్ముతారో అర్థం కావడం లేదనే ఆవేదన జనసేన కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. లోకేశ్ అధికార పల్లకీని మోసే బోయీగా మాత్రమే పవన్ మిగిలిపోవాల్సి వుంటుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. అధికారంలో భాగస్వామ్యం అడిగితే తన్ని పంపడానికి చంద్రబాబు వెనకాడరనే వాస్తవాన్ని… తాజాగా ఎన్టీఆర్‌పై దాడి నిరూపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ప్రేమాభిమానాలు తనపై కాదని, తన వెనుక ఉండే అభిమానులు, కాపు సామాజిక ఓట్లపై మాత్రమేనని పవన్ గ్రహించడానికి ఇంకెంత మూల్యం చెల్లించాలో పవన్‌కల్యాణ్ ఆలోచించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హితవు పలుకుతున్నారు. 2009లో చిన్న వయసులోనే తాత స్థాపించిన పార్టీని అధికారంలోకి తేవడం కోసం తమ అభిమాన హీరో ప్రాణాలకు తెగించి ప్రచారం చేశారని, అవేవీ ఇప్పుడు చంద్రబాబుకు గుర్తు లేవని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు.
కావున తమ నాయకుడికి జరుగుతున్న పరాభవం నుంచైనా గుణపాఠం నేర్చుకుని…పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు దూరంగా ఉంటూ పవన్‌కల్యాణ్ స్వతంత్రంగా ఎదిగేందుకు కృషి చేయాలని హితవు చెబుతుండడం విశేషం. ప్రజలకు దగ్గరగా, బాబుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పవన్ గుర్తించిన రోజు జనసేనకు మంచి రోజులు వచ్చినట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కావున బాబు ప్రలోభాల నుంచి పవన్ బయటపడి సొంతంగా రాజకీయాలు చేస్తారని ఆశిద్దాం.