టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ్టి నుంచి 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను వివరించనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో కార్యక్రమం చేపడుతున్నామని. మీ అందరి భవిష్యత్‌కు తనది గ్యారెంటీ అంటూ బాబు నమ్మబలికారు. ఈ కార్యక్రమానికి మీ భాగస్వామ్యం, సహకారం ఇవ్వాలని ప్రజానీకాన్ని చంద్రబాబు కోరడం గమనార్హం.
బాబు భవిష్యత్ ఏంటో ఆయనకే తెలియదని, ఇక జనానికి గ్యారెంటీ ఇవ్వడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. టీడీపీ భవిష్యత్ ఏంటో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాబు, ఆదరించాలని ప్రజలను వేడుకోవడం మానేసి, తాను తప్ప దిక్కులేదని అహంకారపూరిత మాటలెందుకనే నిలదీతలు ఎదురవుతున్నాయి. ఈ దఫా టీడీపీ అధికారంలోకి రాకపోతే గ్యారెంటీగా తనతో పాటు తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితం ముగుస్తుందని చంద్రబాబుకు తెలుసని నెటిజన్లు అంటున్నారు.
14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు తాను చేసిన పనులు చెప్పుకుని మరోసారి ఆదరించాలని కోరడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెప్పి విధ్వంసం సృష్టిస్తున్నాడంటూ భయపెట్టి, తద్వారా భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని చంద్రబాబు కలలు కంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను రాజకీయంగా భిక్షమెత్తుకుంటూ, భవిష్యత్‌కు గ్యారెంటీ అంటూ భారీ డైలాగ్‌లు చంద్రబాబుకే చెల్లుతాయని ఎద్దేవా చేస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో హామీలు అమలు చేయలేక, చివరికి మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించి, ఇప్పుడు తన పేరుతో ష్యూరిటీ అనడం ప్రపంచ ఎనిమిదో వింతగా నెటిజన్లు వెటకరిస్తున్నారు.
ఇప్పటికైనా గొప్పలు చెప్పుకోవడం మాని, అధికారంలోకి రావడానికి తన పథకాల గురించి ప్రచారం చేసుకోవడం ఉత్తమమని నెటిజన్లు హితవు చెబుతున్నారు.