టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎపుడూ పోలీసులుకు పెద్ద పని పెడుతూ ఉంటారని అంటారు. ఆయనని అరెస్ట్ చేయాలంటే ఇంటి వద్ద అర్ధరాత్రి తరువాత గోడ దూకి ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పకడ్బంధీ వ్యూహాన్ని అమలు చేయాలి.
తీరా అరెస్ట్ చేస్తే ముందస్తు బెయిల్ అయ్యన్న తెచ్చుకున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్ళుగా ఇదే జరుగుతోంది. అయ్యన్న మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అవన్నీ ఆయన నోరు పెద్దది చేసి ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మీద మంత్రుల మీద అసభ్య పద దూషణలు చేయడం మీద పెట్టినవే.
ఇటీవల అయ్యన్నపాత్రుడు కృష్ణా జిల్లా గన్నవరం మీటింగులో సీఎం నుంచి మంత్రులు మాజీ మంత్రులు సహా ఎవరినీ వదలకుండా దారుణంగా మాట్లాడారు అని వైసీపీ నేతలు మండిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈసారి అయ్యన్నను ఇంటి వద్ద అరెస్ట్ చేయలేదు. ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటున్న క్రమంలో ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తుండగా అరెస్ట్ చేశారు. జస్ట్ అలా అయ్యన్న అరెస్ట్ అన్నది జరిగిపోయింది.
పోలీసులు వచ్చారని అయ్యన్న ఇంటి ముందు టీడీపీ తమ్ముళ్ళు హంగామా వివాదాలు గొడవలు, టీవీ లైవ్ వంటివి లేకుండా సింపుల్ గా పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే ప్రధమం. అయితే ఈ అరెస్ట్ మీద అయ్యన్న బెయిల్ తెచ్చుకుంటారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇప్పటికే అయ్యన్న మీద అనేక కేసులు పోలీసులు నమోదు చేశారు. అయితే అవన్నీ కక్షతో పెడుతున్నవే అని అయ్యన్న ఆయన అనుచరులు టీడీపీ నేతలు అంటారు. ప్రజా స్వామ్యంలో నోరు విప్పకూడదా మాట్లాడకూడదా అంటారు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కానీ దారుణంగా విమర్శలు చేయడం అసభ్య పదజాలం ఉపయోగించడం తప్పు అన్నదే పోలీసులు అరెస్టుల ద్వారా చెప్పే విషయం.
ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్న అయ్యన్న చినబాబు లోకేష్ కళ్ళలో ఆనందం కోసం మహిళా మంత్రి అని కూడా చూడకుండా రోజా మీద చేసిన దారుణమైన కామెంట్స్‌కి ఫలితం అరెస్ట్ అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఇది రాజకీయ సాధింపు అని టీడీపీ నేతలు అంటున్నా విషయం ఏంటి అన్నది ప్రజలకు తెలుసు అంటున్నారు. మొత్తానికి అయ్యన్న అరెస్ట్ అయ్యారు అని అంటున్నారు.