వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్న షర్మిలను సోషల్ మీడియాలో వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను జైల్లో వేసిన కాంగ్రెస్ పంచన ఎలా చేరుతారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నడిబజారులో తల్లి విజయమ్మ, వైఎస్ భారతితో పాటు షర్మిల దీన స్థితిలో నిరసన ప్రకటించే ఫొటోలను తెరపైకి తీసుకురావడం ఆసక్తికర పరిణామం.
వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడాన్ని కొందరు ప్రస్తావిస్తూ, షర్మిల కాంగ్రెస్‌లో చేరిక నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. గతంలో వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ చేపట్టాలని భావించిన ఓదార్పు యాత్రకు సోనియాగాంధీ అనుమతి ఇవ్వకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
వైఎస్సార్ మరణానంతరం అన్న అయిన వైఎస్ జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి 16 నెలల పాటు జైలుపాలు చేసిన కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎలా మరిచిపోయావని షర్మిలను నిలదీయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ చేసిన మేలును మరిచి, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేసేందుకే వైఎస్ జగన్‌పై కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన పార్టీలో వైఎస్సార్‌టీపీని విలీనం చేసేందుకు మనసు ఎలా ఒప్పిందని షర్మిలను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.
తనపై అన్న పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టుల ప్రశ్నలు, నిలదీతలకు షర్మిల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది.