వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్ధి నరేశ్‌పై వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 23,700 ఓట్ల ఆధిక్యత సాధించింది.
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను వైసీపీ బరిలో నిలిపింది.
సంప్రదాయం ప్రకారం మృతుల కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించడంతో ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటీకి దిగాయి. భారీ మెజార్టీ లక్ష్యంగా వైసీపీ మొదటి నుంచి ప్రచారం చేపట్టింది.
వైసీపీ వ్యూహమే ఫలించింది. మొదటి రౌండ్ నుంచి వైసీపీ భారీ ఆధిక్యత కనబరుస్తోంది. మొదటి రౌండ్‌లో 8 వేలకు పైగా వైసీపీ మెజార్టీ సాధించింది. మూడో రౌండ్ వచ్చే సరికి ఆ మెజార్టీ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ప్రస్తుతం మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి 23,700 ఆధిక్యతతో వైసీపీ కొనసాగుతోంది. ఇదే మెజార్టీ కొనసాగితే లక్ష పైచిలుకు ఆధిక్యత లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.