హుజూరాబాద్ బై పోల్ కు సంబంధించి కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మెరుగైన మెజారిటీని సంపాదించడం గమనార్హం. దాదాపు ఏడు వందలకు పైగా పోల్ అయిన పోస్టల్ బ్యాలెట్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఐదు వందల మూడు ఓట్లను పొందడం గమనార్హం. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తో ఢీ కొట్టిన బీజేపీ 159 ఓట్లను మాత్రమే పొందింది. కాంగ్రెస్ పార్టీ 32 ఓట్లను పొందింది. 14 పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదని తెలుస్తోంది.
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లే మొత్తం ఎన్నిక ఫలితానికి ప్రామాణికం కాదు కానీ, 700 పోస్టల్ బ్యాలెట్లకు ఏకంగా 500 ఓట్లను టీఆర్ఎస్ పొందడం విశేషమైన అంశమే అని చెప్పాలి. ఈ విషయంలో టీఆర్ఎస్ కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కనీసం పోటీ ఇవ్వలేకపోయినట్టుగా ఉన్నాడు. మరి ఇదే పరిస్థితి అసలు ఓట్ల విషయంలో కూడా జరుగుతుందా లేక బీజేపీ సత్తా చూపిస్తుందా అనేది ఉత్కంఠతో కూడుకున్న పరిణామంగా మారింది.
హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ తో పాటు ఏపీలో బద్వేల్ బై పోల్ కౌంటింగ్ కూడా కొనసాగుతూ ఉంది. బద్వేల్ బై పోల్ విషయంలో కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. బద్వేల్ పోటీ నుంచి టీడీపీ తప్పుకోగా.. బీజేపీ తీవ్రంగానే శ్రమించింది. కాంగ్రెస్ పార్టీనే పోటీలో ఉంది. హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ ను బీజేపీ తన వైపుకు తిప్పుకుని బీజేపీ అక్కడ పని చేసింది. హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొని ఉండగా, బద్వేల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఏ స్థాయిలో ఉంటుందనేది మరి కాసేపటి నుంచి క్లారిటీ రానుంది.