తను హోస్టుగా వ్యవహరించిన మాస్టర్ షెఫ్ ప్రోగ్రామ్ కు సంబంధించి నిర్వహాకులు ముందుగా మాట్లాడుకున్న మొత్తాన్ని తనుకు చెల్లించలేదంటూ లీగల్ యాక్షన్ కు దిగిన నటి తమన్నా భాటియాకు ఆ నిర్వాహాకులు కౌంటర్ వివరణ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టారని తమన్నా తన నోటీసుల్లో పేర్కొనగా, ఆమె వల్ల తమకు చాలా నష్టం జరిగిందని, ఇప్పటికే చెల్లించిన మొత్తం కూడా ఎక్కువే అన్నట్టుగా నిర్వాహకులు తమ వివరణలో పేర్కొన్నారట.
వాస్తవానికి తమన్నా హోస్టుగా ఆ షో గ్రాండ్ ప్రారంభం అయ్యింది. అయితే.. షో హిట్ అనిపించుకోలేదు. వంట ప్రోగ్రామ్ కు తమన్నా యాంకరింగ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో లెక్కలేసుకుపోయారేమో. సరిగ్గా 20 ఎపిసోడ్లు పూర్తి అవుతుండగానే ఆమె తప్పుకుంది. ఆ స్థానంలో అనసూయ వచ్చింది.
అప్పటికే షో ఫ్లాప్ అయిన వేడిలో ఉన్నారేమో నిర్వాహకులు. అయితే తమన్నా మాత్రం వారిని వదిలినట్టుగా లేదు. తనకు డబ్బులు ఎగ్గొట్టారని నాల్రోజుల కిందట నోటీసులు పంపించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తమన్నా అగ్రిమెంట్ మేరకు షూటింగుకు హాజరు కాలేదని, ఆమె ఎగ్గొట్టిన రోజులతో కలుపుకుంటే తమకు ఐదు కోట్ల రూపాయల వరకూ నష్టం అని నిర్వాహకులు తమ కౌంటర్లో పేర్కొన్నారట.
ఆమెకు 18 రోజుల షూటింగుకు గానూ రెండు కోట్ల రూపాయల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా అయితే ఆమె రెండు రోజుల పాటు షూటింగుకు హాజరు కాలేదని, దీంతో అప్పటి వరకూ చేసుకున్న ఏర్పాట్లకుగానూ తమకు ఐదు కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చిందని వారు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాము తమన్నాకు కోటిన్నర రూపాయల వరకూ చెల్లించినట్టుగా వారు కౌంటర్లో పేర్కొన్నారట. ఆమె షూటింగుకు ఎగ్గొట్టడంతో తమకు ఐదు కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారట. ఇలా పారితోషికం విషయంలో తమన్నా వర్సెస్ మాస్టర్ షెప్ నిర్మాతల పోరాటం లీగల్ గా సాగేలా ఉంది. మరి ఈ పోరాటంలో ఎవరి వాదన నెగ్గుతుందో!