బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడుని రేవ్ పార్టీలో అదుపులోకి తీసుకుని సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖడేకు బదిలీ తప్పదనే టాక్ వినిపిస్తూ ఉంది. వాంఖడే పై వచ్చిన ఆరోపణలు, గతంలో ఈయన ట్రాక్ రికార్డు, ఇప్పుడు ముప్పేట జరుగుతున్న దాడి.. నేపథ్యంలో వాంఖడే బదిలీ తప్పదనే మాట వినిపిస్తూ ఉంది.
వాంఖడేపై మహారాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడుతూ ఉంది. మహారాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే ఇదంతా అనే ఆరోపణతో సహా రకరకాల రీతిలో ప్రభుత్వంలోని వారి నుంచి ఈ అధికారిపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాంఖడే బదిలీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్టే.
మహారాష్ట్రలోని ప్రభుత్వ అభ్యంతరాలను కేంద్రం మామూలుగా అయితే పట్టించుకోదు. అయితే వాంఖడేపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో… విజిలెన్స్ విచారణ తప్పని సరిగా మారినట్టుగా ఉంది. ఆర్యన్ ఖాన్ దొరికిన స్పాట్ నుంచి పాతిక కోట్ల రూపాయల మొత్తాన్ని వాంఖడే డిమాండ్ చేశాడనే ఒక సాక్షి కథనం పెను సంచలనంగా మారింది. ఇదంతా కుట్ర అని వాంఖడే అంటున్నాడు.
అతడే కాదు.. ఈ విషయంలో అనేక మంది ఇదే మాట మాట్లాడుతున్నారు. షారూక్ పరపతి నేపథ్యంలో.. ఇదంతా ఒక అధికారిపై కక్ష సాధింపు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే వాంఖడేపై ప్రత్యక్ష సాక్షి ఒకరు చేసిన ఆరోపణపై షారూక్ ఫ్యామిలీ స్పందించలేదు. ఆ సాక్షితో తమకు సంబంధం లేదని అంటోంది.
ఒకవేళ వాంఖడే తమను డబ్బు డిమాండ్ చేసినట్టుగా షారూక్ మేనేజర్ గనుక స్టేట్ మెంట్ ఇచ్చి ఉంటే అదో కథ. అయితే వారేమో తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదంటున్నారు. బహుశా ఇప్పుడు ఆర్యన్ ను విడిపించుకోవడం మీదే వారి ఆసక్తి ఉండవచ్చు. అనవసరంగా ఎన్సీబీతో ఎందుకు కెళుక్కోవాలని భయపడుతూ ఉండవచ్చు కూడా! ఒకవేళ వాంఖడే నిజంగానే డబ్బు డిమాండ్ చేసి ఉన్నా.. ఇప్పుడు ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉన్న రీత్యా… షారూక్ ఫ్యామిలీ దూకుడుగా స్పందించే ఛాన్సే ఉండదు.
అయితే… ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని ఎన్సీబీ స్టేట్ మెంట్ ఇవ్వడం, ఇప్పుడు అతడికి ఏకంగా అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు అంటూ ఉండటం.. పరస్పరం భిన్నమైన వాదనలుగానే ఉన్నాయి.
అలాగే గతంలో కూడా వాంఖడే పలువురు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టాడనే కథనాలు బయటకు వస్తున్నాయి. కస్టమ్స్ లో పని చేస్తూ ఉన్నప్పుడు.. ముంబై ఎయిర్ పోర్టులో అనేక మంది సెలబ్రిటీలను గంటల కొద్దీ ఆపి, రకరకాలుగా విచారణ పేరుతో నిర్బంధించాడనే పేరు వాంఖడేకు ఉంది. షారూక్ ను కూడా గతంలో కొన్ని గంటల పాటు ఎయిర్ పోర్టులో నిర్బంధించిన చరిత్ర ఉందట వాంఖడేకు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు అనేక మందికి కూడా ఈ అధికారి నుంచి ఇదే అనుభవం ఎదురయ్యిందట. వారిలో చాలా మంది స్టార్లున్నారు.
ఏతావాతా.. వాంఖడే వ్యవహారం కాస్త వివాదాస్పదం అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్సీబీ కూడా తమకు మకిలి అంటకుండా, ఈ కేసు విచారణ నుంచి వాంఖడే ను తప్పించాలని భావిస్తోందట. వాంఖడే స్థానంలో మరొక అధికారికి ఈ కేసు బాధ్యతలు అప్పగించనున్నారనే మాట వినిపిస్తోందిప్పుడు.