మొన్నటి వరకూ టీ20 ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ లలో ముందు వరసలోని జట్టు టీమిండియా. ఈ సీరిస్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టుగా ప్రకటించిన కొహ్లీ చివరగా తన ఖాతాలో ఉన్న పెద్ద లోటును భర్తీ చేసుకుంటాడాని చాలా మంది అభిమానులు ఆశించారు.
ఒక ఈ సారి ధోనీని మెంటర్ గా నియమించడం మరోసానుకూలాంశం అనే లెక్కలు, విశ్లేషణలు వచ్చాయి. ఇక సంజయ్ మంజ్రేకర్ అయితే.. సెమిస్ కు చేరడం టీమిండియాకు నల్లేరు మీద నడకన్నాడు.
సూపర్ 12 జట్ల లెక్కలు తేలాకా మంజ్రేకర్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా తప్ప అన్నీ బలహీనమైన జట్లే అన్నట్టుగా ఆయన విశ్లేషించాడు. కట్ చేస్తే.. పాక్ తో ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఎదురైన ఓటమితో టీమిండియా అవకాశాలు క్లిష్టంగా మారడం గమనార్హం. లీగ్ దశలో ఇండియాకు ఇంకో నాలుగు మ్యాచ్ లు మిగిలాయి. ఆ నాలుగింటా టీమిండియా గెలిస్తేనే.. సెమిస్ కు చేరే అవకాశం ఉంది. లేకపోతే అంతే సంగతులు.
ఈ మ్యాచ్ లలో ముందుగా కివీస్ తో టీమిండియా తలపడుతుంది. టీ20 ఫార్మాట్ లో కివీస్ ప్రమాదకరమైన జట్టు. అయితే పాక్ తో ఓడిపోయింది. మరి నెక్ట్స్ జరగబోయే ఈ కీలక మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికే సెమిస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఈ గ్రూప్ నుంచి వరసగా రెండు విజయాలతో పాక్ తన బెర్త్ ను దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. ఆ జట్టుకు మిగిలిన మ్యాచ్ లు అప్ఘాన్, నమీబియా, స్కాట్ లాండ్ లతో ఉన్నాయి. వీటిల్లో ఆ జట్టు విజయవకాశాలు ఎక్కువ. అఫ్ఘాన్ మాత్రమే పోటీ ఇవ్వగలదేమో, టీ20 ఫార్మాట్ కాబట్టి.. ఏవైనా అద్భుతాలకూ కాస్త ఆస్కారం ఉంది. ఏదేమైనా పాక్ ప్రస్తుతానికి సేఫ్.
టీమిండియా న్యూజిలాండ్ మీద గెలిస్తేనే.. సెమిస్ పై ఆశలుంటాయి. న్యూజిలాండ్ పై గెలిస్తే ఆ పై ఇండియాకు అఫ్గాన్, నమీబియా, స్కాట్ లాండ్ లతో మ్యాచ్ లు ఉంటాయి. వాటిల్లో.. సంచలనాలకు అవకాశం ఇవ్వకుండా, సేఫ్ గా నెగ్గితే.. సెమిస్ బెర్త్ ఉన్నట్టే. కివీస్ తో ఓడితే మాత్రం.. ఆ తర్వాత చిన్న జట్లు ఏవైనా పాక్ ను, కివీస్ ను ఓడిస్తాయేమో అని లెక్కలేసుకోవాల్సి ఉంటుంది.
ఏదేమైనా ఒకే ఒక్క మ్యాచ్ లో ఓటమితో.. అది కూడా తొలి మ్యాచ్ ఫలితంతోనే టీ20 ప్రపంచకప్ లో ఇండియా పరిస్థితి క్లిష్టంగా మారడం గమనార్హం!