‘ముందస్తు’ ఊహల నిపుణులు ఇక ఆపితే బెటర్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని ఏపీలోని రాజకీయ అత్యుత్సాహులు, విశ్లేషకులు సుమారు ఏడాదిన్నరగా అంచనాలు వేస్తూనే ఉన్నారు. ఇదిగో ముందస్తు, వచ్చే నెలలో అసెంబ్లీ రద్దు అంటూ ఊకదంపుడు ప్రచారాలతో పబ్బం…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని ఏపీలోని రాజకీయ అత్యుత్సాహులు, విశ్లేషకులు సుమారు ఏడాదిన్నరగా అంచనాలు వేస్తూనే ఉన్నారు. ఇదిగో ముందస్తు, వచ్చే నెలలో అసెంబ్లీ రద్దు అంటూ ఊకదంపుడు ప్రచారాలతో పబ్బం గడుపుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏదో ఒక పనికిమాలిన యూట్యూబ్ చానెల్లో ఒక ఊహ విశ్లేషణ రూపంలో రావడం.. దాన్ని పట్టుకుని.. జగన్ సర్కారు వెంటనే దిగపోవాలని కోరుకునేవాళ్లంతా ముందస్తు ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతూ వస్తోంది. 

మరొకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పదేపదే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని.. కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని పదేపదే పిలుపు ఇచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే మాట అనేది చంద్రబాబునాయుడుకు అవసరం. ‘త్వరలోనే ఎన్నికలు’ అంటేనే ఆయన పార్టీని కాపాడుకోగలరు. లేకపోతే పార్టీ శ్రేణులు జారిపోతారని ఆయనకు భయం. నీరసపడిపోతారని ఆందోళన.  అందుకని ముందస్తు అనేది ఒక అస్త్రంలాగా ఆయన పదేపదే వాడుతూ వస్తున్నారు.

‘ముందస్తు ఎన్నికలు అనేవి ఉండవు బాబోయ్’ అని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు  పదేపదే చెప్పినా కూడా.. ముందస్తు గురించి ప్రచారంచేసేవాళ్లు అదే ఊహల్లో బతుకుతూ వస్తున్నారు. ‘ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేముంది. ప్రజలు మేం అయిదేళ్లు అధికారంలో ఉండడానికి తీర్పు ఇచ్చారు’ అని సజ్జల విపులంగా చెప్పినా ఎవ్వరికీ తలకెక్కలేదు. 

అయితే ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలు చేసిన వాళ్లంతా నోరుమూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. నాలుగేళ్లు అవుతుండగా.. తాము చేపడుతున్న సంక్షేమ పథకాల్లో కొన్ని సంస్కరణలకు కూడా ఇప్పుడిప్పుడే శ్రీకారం చుడుతోంది. 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటిన వారికి, విశాలమైన పెద్ద ఇళ్లున్నవారికి పెన్షన్లు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి అందాలంటే ఇలాంటి సంస్కరణలు ఖచ్చితంగా అవసరం. అయితే ఈ సంస్కరణల వల్ల తక్షణ స్పందనగా కొంత వ్యతిరేకత వస్తుంది. కొన్నిచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అనుకోవడం భ్రమ. 

తాజాగా సీపీఐ రామకృష్ణ కూడా తన ముందస్తు కోరికను బయటపెట్టుకుంటున్నారు గానీ.. ఇలాంటి ప్రతికూల వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లదు గాక వెళ్లదు. తాముచేసిన సంస్కరణలన్నీ మంచివే అని ప్రజలను కన్విన్స్ చేసేవరకు ఆగి, ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్తుంది. అంటే 2024 లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు.