తెలుగుదేశం పార్టీని వీడాలని ఫిక్సయిన వల్లభనేని వంశీ మోహన్ బేషరతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే షరతుకు వల్లభనేని సై అన్నట్టుగా తెలుస్తోంది. తను రాజీనామాకు రెడీ అని, తనకు ఎమ్మెల్సీ పదవి కూడా అక్కర్లేదని ఆయన తేల్చిచెప్పినట్టుగా సమాచారం.
తన అనుచరవర్గాన్ని కాపాడుకోవడమే తన ముందున్న లక్ష్యమని వల్లభనేని భావిస్తున్నాడట. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు టికెట్ ఎవరికి ఇచ్చినా తను సపోర్ట్ చేస్తానంటూ వల్లభనేని హామీ ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీచేసి ఓడిన యార్లగడ్డకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. ఆయనకు సపోర్ట్ చేయడానికి అభ్యంతరం లేదని వంశీ చెప్పారట.
కృష్ణాజిల్లాలో సామాజికవర్గం సమీకరణాల దృష్ట్యా వంశీని చేర్చుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని సమాచారం. ఆయనకు కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా దక్కుతాయని ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను చేర్చుకోకపోతే భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు వల్లభనేని వంశీ మోహన్ రెడీ అయినట్టుగా సమాచారం.