బాక్సైట్ తవ్వకాలకు తమ పాలనలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు తరచూ చెప్పుకుంటారు. కానీ అటవీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో దూకుడు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అంటున్నారు. అటవీ సంపదను కొల్లగొట్టడానికి ఆనాడు చూస్తే శారదాపీఠమే గట్టిగా అడ్డుకుంది అని ఆయన తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.
ప్రకృతి సంపద మీద ఎవరు కన్నేసినా ఎదిరించి కాపాడుకోవాల్సింది గిరిజనులే అని ఆయన ఉద్బోదించారు. గిరిజనం ప్రకృతితోనే ఉంటూ అక్కడ సంపదను కాపాడుతున్నారని ఆయన అన్నారు. బాక్సైట్ తవ్వకాలను జరగకుండా నిలువరించాలని పోరాటం చేయాలని స్వామీజీ పిలుపు ఇచ్చారు.
గిరిజన ప్రాంతంలో మతం మార్పిళ్ళకు ఒక ప్రధాన మతానికి చెందిన వారు కారణం అవుతున్నారు అని స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మతం ఎవరో ఏమిటో ఆయన చెప్పలేదు. స్వామీజీ చాణ్ణళ్ళ తరువాత రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆయన కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఇపుడు మరోసారి తెలుగుదేశం మీద ఆయన పరోక్ష విమర్శలు చేశారని అంటున్నారు.