విజేత‌ల‌కు ఉండే అల‌వాట్లు ఇవి..!

ఒక్కోరికి ఒక్కో ర‌క‌మైన అల‌వాట్లు ఉంటాయి. దేన్నైనా సాధించిన‌, సాధించ‌గ‌ల విజేత‌ల‌కు కూడా కొన్ని ర‌కాల అలవాట్లు ఉంటాయి. అలాంటి అల‌వాట్ల‌తోనే వారు విజ‌యాలు సాధించారు. అలాంటి అల‌వాట్లు ఉంటే.. ఎవ‌రైనా విజ‌యాలు సాధించ‌గ‌ల‌రు…

ఒక్కోరికి ఒక్కో ర‌క‌మైన అల‌వాట్లు ఉంటాయి. దేన్నైనా సాధించిన‌, సాధించ‌గ‌ల విజేత‌ల‌కు కూడా కొన్ని ర‌కాల అలవాట్లు ఉంటాయి. అలాంటి అల‌వాట్ల‌తోనే వారు విజ‌యాలు సాధించారు. అలాంటి అల‌వాట్లు ఉంటే.. ఎవ‌రైనా విజ‌యాలు సాధించ‌గ‌ల‌రు కూడా! మ‌రి ఆ అల‌వాట్లు .. వాటిని అల‌వ‌రుచుకుంటే విజ‌యానికి ఉన్న అవ‌కాశాల‌ను ఒక సారి ప‌రిశీలిస్తే!

చెడ్డ రోజులు కొంత‌కాల‌మే!

చెడ్డ రోజుల‌ను భ‌రించ‌లేని వెధ‌వ మంచి రోజులు వ‌చ్చే వ‌ర‌కూ బ‌త‌క‌లేడు.. అన్నాడు తెలుగు ర‌చ‌యిత కేఎన్ వై ప‌తంజ‌లి. చ‌రిచి న‌ట్టుగా చెప్పినా ప‌తంజ‌లి చెప్పింది జీవిత స‌త్యం. ఉద్యోగంలోనో, వృత్తిలోనో.. కొన్ని క‌ఠిన‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వ్వొచ్చు! వాటికి చ‌లించి వెన‌క్కు త‌గ్గితే ఆ త‌ర్వాత మంచి రోజులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ని విజేత‌ల క‌థ‌లు చెబుతున్నాయి. క‌ఠిన‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని ముందుకు సాగిన వారే.. ఆ త‌ర్వాత తాము కోరుకున్న‌టు వంటి వాటిని పొంద‌గ‌ల‌రు!

గ‌డువుకు ముందే ప‌ని పూర్తి!

ఏ ప‌నినైనా వాయిదాలు వేసే వారికి స‌క్సెస్ కూడా వాయిదా ప‌డుతూ ఉండ‌వ‌చ్చు. అనుకున్న ప‌నిని, పెట్టుకున్న ప్లాన్ ను గ‌డువుకు త‌గ్గ‌ట్టుగా పూర్తి చేసే వారు విజ‌యం దిశ‌గా వేగంగా సాగ‌గ‌ల‌రు. రేప‌టి ప‌నిని ఈ రోజే పూర్తి చేయ‌గ‌లిగే శ‌క్తి విజ‌యం దిశ‌గా సాగిపోయే వారికి ఉంటుంది.

విజ‌యం మీద క‌న్నా సాగే దారిపైనే దృష్టి!

ఒక టార్గెట్ ను పెట్టుకుని ప‌ని చేస్తున్న‌ప్పుడు కొన్ని సెట్ బ్యాక్స్ ఎదురుకావొచ్చు. వీటి వ‌ల్ల నిస్పృహ‌కు గురి కావ‌డం లేదా, పెట్టుకున్న టార్గెట్ ని వ‌దిలేయ‌డం వంటివి స‌రికాదు. అంతిమం విజ‌యం ఎలాగూ ద‌క్కుతుంది… వెళ్లే దారిపై న‌మ్మ‌కం ఉంచి సాగుతున్న‌ప్పుడు మాత్ర‌మే!

ఆశావ‌హ ధోర‌ణి..

విజేత‌ల‌కు ఉండే మ‌రో క్వాలిటీ ఆశావ‌హ ధృక్ప‌థం. నిరాశ చెంద‌కుండా.. అనుకున్న ప‌ని మీద దృష్టి పెట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి. కొంత ప్ర‌య‌త్నం త‌ర్వాత ఏదో కార‌ణం చేత నిరాశ చెంద‌డం, ప‌ట్టిన ప‌ట్టు వీడ‌టం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుంటూ ముందుకు సాగే ఆశావ‌హ ధోర‌ణి విజేత‌ను త‌యారు చేయ‌గ‌ల‌దు.

రిస్క్ తీసుకుంటారు!

కంఫ‌ర్ట్ జోన్లో ఉంటే ఏదీ అంద‌దు. రిస్క్ తీసుకున్న‌ప్పుడే అనుకున్న‌దో, అద్భుత‌మో సాధ్యం అవుతుంది. కంఫ‌ర్ట్ జోన్లో ఉండి క‌ల‌లు కంటూ ఉన్నా, పెద్ద పెద్ద క‌ల‌ల‌ను పెట్టుకున్నా.. అవి సాకారం కావాలంటే మాత్రం కంఫ‌ర్ట్ జోన్ ను వ‌దిలి రావాల్సి రావొచ్చు. మ‌నిషి జీవితంలో పెద్ద శత్రువు కూడా కంఫ‌ర్ట్ జోనే! కెరీర్ ఆరంభంలోనే కొంద‌రు కంఫ‌ర్ట్ జోన్ లోకి వెళ్లిపోయి.. ఆ తర్వాత తాము ఎదిగే అవ‌కాశాలు లేకుండా తామే చేసుకుంటూ ఉంటారు. అయితే రిస్క్ చేయ‌గ‌లిగే వారికి మాత్రం విజ‌యం సొంతం అవుతుంది.

ఇత‌రుల సాయాన్ని ఆశించ‌డం త‌ప్పు కాదు!

అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో ఇత‌రుల నుంచి సాయాన్ని ఆశించ‌డం కానీ, గైడెన్స్ ను పొంద‌డం కానీ విజేత‌ల అల‌వాటే. ఈ విష‌యంలో మొహ‌మాటం లేదా గ‌ర్వం స‌బ‌బు కాదు. ఇత‌రుల నుంచి అడిగి అయినా అవ‌స‌ర‌మైన సాయాన్ని పొందిగ‌లిగే త‌త్వం కూడా విజ‌యం దిశ‌గా నిల‌ప‌గ‌ల‌దు.