పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్నానని చెప్పి పవన్ ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేసిన రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి మరింత కాకరేపాడు. సినిమా టైటిల్ మధ్యలో గ్లాస్ గుర్తు పెట్టినప్పుడే ఇదేదో శృతిమించే వ్యవహారం అని అర్థమైపోయింది. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ పై గట్టి సెటైరే వేయబోతున్నాడనేది పోస్టర్ చూస్తేనే అర్థమౌతోంది.
ఇక పోస్టర్ లో పవన్ దిగాలుగా కనిపించే స్టిల్, ఆ పక్కనే “ఎన్నికల ఫలితాల తర్వాతి కథ” అనే ట్యాగ్ ఇచ్చాడు ఆర్జీవీ. పవన్ గత జీవితం, వ్యక్తిగత జీవితంలోకి ఈ దర్శకుడు వెళ్లడనే హింట్ అయితే ఇచ్చారు కానీ, వర్మని నమ్మేవారు ఎవరు? పవన్ తిక్కకైనా లెక్కుంది, కానీ వర్మ తిక్కకు అసలు లెక్కే లేదు.
అమృత నిజజీవిత కథతో వస్తున్న సినిమాపై కేసు నమోదయ్యే దశలో కూడా వెనక్కి తగ్గనంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన వర్మని ఎవరైనా ఎందుకు తక్కువ అంచనా వేస్తారు. అంటే పవన్ కల్యాణ్ పై మంచి సెటైరిక్ మూవీనే ఓటీటీ ప్రేక్షకులు ఆశించవచ్చన్నమాట. అయితే అది 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాగా చప్పగా ఉంటుందా, 'రక్తచరిత్ర'లాగా వర్మ పరపతి పెంచుతుందా అనేది మాత్రం తేలాల్సి ఉంది.
ఇదంతా ఒకెత్తు అయితే.. వర్మ పోస్టర్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో పడుతున్న పోస్టింగ్ లు, కామెంట్లు మరో ఎత్తు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వర్మని తగులుకున్నారు. గతంలో 'రెడ్డిగారు పోయారు' అనే సినిమాపై కూడా ఇలానే పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ, ముందు ఆ సినిమా విడుదల చేయాలని, తర్వాతే పవన్ కల్యాణ్ జోలికి రావాలని విమర్శించారు.
పవన్ వ్యక్తిగత జీవితం జోలికి పోతే తాటతీస్తామంటూ మరికొంతమంది ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇంకొంతమంది వర్మ ఫ్యామిలీని బూతులు తిడుతూ పోస్టింగులు పెడుతున్నారు. అటు యాంటీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఇదో పండగలా కనిపిస్తోంది. వారంతా వర్మకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు పండగ చేసుకున్న పవన్ ఫ్యాన్స్, ఇప్పుడు కూడా పండగ చేసుకోండంటూ రెచ్చగొడుతున్నారు.
కేవలం పవన్ ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకునే, వివాదాలని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోటే వర్మ ఈ సినిమా తీస్తున్నాడనే విషయం ఈ స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. క్లైమాక్స్, నగ్నం సినిమాలతో యువత బలహీనతని సొమ్ము చేసుకున్న వర్మ, పవర్ స్టార్ సినిమాతో ఆయన అభిమానుల బలహీనతని క్యాష్ చేసుకోబోతున్నాడు.
పవన్ పై సెటైరిక్ సినిమా అయినా.. ఏం చూపించాడోననే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరూ తొలి రోజే ఓటీటీలో సినిమా చూస్తారు. పవన్ ఫ్యాన్స్ లో కనీసం పాతిక శాతం మంది చూసినా వర్మకు కళ్లుచెదిరే లాభాలు గ్యారెంటీ. అతడు కోరుకునేది కూడా ఇదే కదా.
Here is the first look poster of POWER STAR film soon to release in RGVWORLDTHEATRE #JaiPowerStar pic.twitter.com/YMbqXyRu2E
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020