జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూర్ పెట్టుకున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రధాని వచ్చే రోజే కాస్తా ముందుగానే విశాఖలో ల్యాండ్ అవుతారు అని అంటున్నారు.
విశాఖ టూర్ లో ఆయన జనసేన కార్యక్రమాలలో ఆయన పాలుపంచుకుంటారా లేక మోడీతో భేటీ అయ్యేందుకే వస్తున్నారా అన్న వివరాలు అయితే తెలియడంలేదు. ఇంతకీ పవన్ వస్తున్నారా లేదా అన్నది కూడా కచ్చితంగా తెలియడంలేదు.
పవన్ ప్రత్యేక విమానంలో విశాఖకు ఈ నెల 11న వస్తున్నారని మాత్రం అంటున్నారు. విశాఖలో 11న రాత్రి బస చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తో ఆయన భేటీ అవుతారు అని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి అటు జనసేన కానీ ఇటు బీజేపీ వర్గాలు కానీ ఏపీ చెప్పడంలేదు.
బీజేపీ నాయకులు అయితే ప్రధాని మొత్తం టూర్, ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రధాని ఆఫీస్ చూసుకుంటుందని చెప్పి తప్పుకుంటున్నారు. ప్రధాని ఆఫీస్ నుంచి విశాఖలో ఆయన భేటీ కోసం జనసేనాని ప్రయత్నాలు చేసి సాధించుకున్నారా అన్న దాని మీద ఉత్కంఠగా ఉంది. పవన్ ప్రధాని మోడీతో భేటీ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో సమీకరణలు అటు ఇటూ మారవచ్చు అంటున్నారు.
ఇప్పటిదాకా టీడీపీతో బీజేపీతో కలసి పనిచేయాలనుకుంటున్న పవన్ ఇపుడు బీజేపీతోనే మిత్రపక్షంగా ఉండాలనుకుంటున్నారా లేక బీజేపీని కూడా తనతో పాటే నడిపించేలా మోడీ దగ్గర నుంచి కొత్త రోడ్ మ్యాప్ తెచ్చుకుంటారా ఇవన్నీ ప్రశ్నలు.
ఈ నెల 11న విశాఖ వేదికగా ఏమి జరుగుతుంది అన్నది చూడాలి. 12న మోడీ జగన్ పాల్గొనే సభలో పవన్ పాలుపంచుకుంటారా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. విశాఖకు పవన్ అంటూ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజమెంత తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.