తెలంగాణాను కాద‌ని… ఏపీకి కేంద్రం అండ‌!

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. ఇది చెన్నైలోని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) సాక్షిగా నిరూపిత‌మైంది. ఏపీకి కేంద్రం మ‌ద్ద‌తుగా నిలిచిన వైనాన్ని తెలంగాణ త‌ర‌పు…

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. ఇది చెన్నైలోని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) సాక్షిగా నిరూపిత‌మైంది. ఏపీకి కేంద్రం మ‌ద్ద‌తుగా నిలిచిన వైనాన్ని తెలంగాణ త‌ర‌పు న్యాయ‌వాది ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. 

కృష్ణా జ‌లాల‌పై ఏర్ప‌డిన వివాదం చినికి చినికి గాలివాన‌గా మారిన చందంగా… రెండు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం సాగునీటి ప్రాజెక్టుల‌పై ఫిర్యాదు చేసుకునే వ‌ర‌కూ దారి తీశాయి. దీని ప‌రిణామాలు మున్ముందు ఏ ప‌రిస్థితుల‌కు దారి తీస్తాయో తెలియ‌దు కానీ, రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను జులై 7 నుంచి నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదించింది. అయితే ఏపీ ప్ర‌భుత్వ వాద‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం తిప్పికొట్టింది. అక్క‌డ ఇంకా పనులు  కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది.  

గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని,  బాధ్యులైన అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ వాసి జి.శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ  ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇదే సంద‌ర్భంలో కేంద్ర ప్ర‌భుత్వం నివేదిక ఏపీ ప్ర‌భుత్వ వాద‌న‌ను బ‌ల‌ప‌రిచేలా ఉండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అక్క‌డ ఎలాంటి ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని , అనుమ‌తులు కోరుతూ ఏపీ ప్ర‌భుత్వం చేసిన ద‌ర‌ఖాస్తు పెండింగ్‌లో ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఎన్జీటీ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ త‌ర‌పు న్యాయ‌వాది కె.శ్ర‌వ‌ణ్‌కుమార్ వాద‌న‌లు వినిపిస్తూ కేంద్రం ఏపీకి అనుకూలంగా ఉండటంతో వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వలేదన్నారు.  

ఎన్జీటీ కోర్టులో బుధ‌వారం మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పనులు కొనసాగుతూనే ఉన్నాయని, కావాలంటే మీరు సంద‌ర్శించవ‌చ్చ‌ని ధ‌ర్మాస‌న స‌భ్యుల‌ను ఉద్దేశించి అన్నారు. 

సంద‌ర్శించ‌డానికి వీలు కాని ప‌క్షంలో డ్రోన్ల ద్వారా ఫొటోలు తీయిస్తామ‌ని అన్నారు. ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుంటూ రేపు వాళ్లు (ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తినిధులు) కూడా మీ ప్రాజెక్టుల‌పై డ్రోన్ల‌కు అనుమ‌తించాల‌ని కోరుతార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.