సోషల్ మీడియాలో సృజనకారులు పెరిగిపోతున్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తమదైన శైలిలో క్రియేటివిటీతో ఆకట్టుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో మెసేజింగ్ సర్వీస్ వాట్సప్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీనిపై వెంటనే సోషల్ మీడియాలో చిన్నపాటి కుదుపు మొదలైంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తెరపైకి రావడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. వాట్సప్‌నకు సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కరించి, యధావిధిగా మెసేజ్‌లు వచ్చేందుకు ఐటీ పితామహుడు చంద్రబాబే కారణమంటూ వ్యంగ్య కామెంట్స్, ఆయన ఫొటోతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం విశేషం. ఐటీకి తానే ఆద్యుడని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటుండంతో ఆయన్ను ఈ విధంగా ర్యాగింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
కంప్యూటర్, సెల్‌ఫోన్ ఇలా అన్ని రకాల సాంకేతిక వస్తువులను కనుగొన్నది తానేనని చంద్రబాబు మంచినీళ్లు తాగినంత సులువుగా గొప్పలు చెప్పుకోవడం చూసి లోకం నివ్వెరపోయిన సందర్భాలెన్నో. తాజాగా వాట్సప్‌నకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తడం, పరిష్కారం లభించిన నేపథ్యంలో చంద్రబాబుపై సెటైర్స్ దీపావళి టపాసుల్లా పేలుతున్నాయి.
సాంకేతిక విప్లవకారుడు చంద్రబాబు చొరవతో ప్రపంచం ఓ పెద్ద సమస్య నుంచి త్వరగా బయటపడిందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. హ్యాట్సప్ బాబు అంటూ నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. ఏదైనా మనది కాని దానిపై కూడా పేటెంట్ పొందాలనుకుంటే… పరిస్థితి ఇలాగే వుంటుంది మరి!