హైదరాబాద్లో ఇందిరాపార్కులోకి పెళ్లికాని జంటలకు ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు పార్కు వద్ద ఓ బోర్డు తగిలించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళల నుంచి నిరసన వ్యక్తం కావడం గమనార్హం.
సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందిరా పార్కు అంటే ప్రేమ జంటలకు నిలయమనే పేరుంది. ప్రేమ జంటలతో పాటు పిల్లాపాపలతో ఆటవిడుపుగా అక్కడికి చాలా మందే వెళుతుంటారు. ఎవరి ఆనందం వారిదన్నట్టు మునిగి తేలి ఉంటారు.
ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఇందిరా పార్కులోకి పెళ్లికాని వారిని రావద్దంటూ హుకుం జారీ చేయడంపై కొందరు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన ఫేస్బుక్లో రాసిన ఈ వాక్యాలు నిరసన స్థాయి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
“అసహ్యం వేయడంలేదూ ఇందిరా పార్కు వద్ద ఆ బోర్డు చూస్తే. ఎవడా ఫత్వా జారీ చేసినవాడు. ఎవడా నీతుల సిగ్గు బిళ్ళలు ఆడవాళ్లకు వేలాడ దీయాలని అన్నవాడు. ఎంత బరితెగించి ఈ సిగ్గు మాలిన బోర్డులు పెట్టిన వాడు? చేయాల్సింది ఒక్కటే… పోయి ఆ బోర్డును లాగి, నేలకేసి కొట్టడం. పెట్టండి బోర్డులు పోలీసు స్టేషన్ల ముందు, గాంధీ ఆస్పత్రి ముందు. ” స్త్రీ లారా జాగ్రత్త! ఇక్కడ రేపులు జరిగే ప్రమాదం ఉంది” అని. వేలాడ గట్టండి ఈ దేశం ముఖద్వారం మీద ” ఇక్కడ ప్రతి రెండు నిమిషాలకి ఒక రేప్ చొప్పున జరుగును” అని.
ఇది మనవాద సిద్ధాంతంలో భాగంగా వెలసిన బోర్డుగా మహిళలు భావిస్తున్నారు. పార్కులంటే… అదేదో అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా భావించి, అందర్నీ ఒకే గాట కట్టేయడంపై నిరసన వ్యక్తమవుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టులు తెలియజేస్తున్నాయి.