రవిశాస్త్రిని సాగనంపుతారా? లేక ముంబై లాబీ ద్వారా ఆయనే మళ్లీ కొనసాగగలుగుతారా? అనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. టీమిండియా కోచ్ ను ఇప్పుడు ప్రత్యేకంగా నిందించేదీ లేదు, ప్రత్యేకంగా ప్రశంసించేదీ లేదు! అన్నట్టుగా సాగుతూ ఉంది వ్యవహారం. కోచ్ గా రెండేళ్లకు పై నుంచినే జట్టుతో ఉన్న రవిశాస్త్రి విషయంలో విమర్శలూ పెద్దగా లేవు, అలాగని ప్రశంసలూ లేవు.
గతంతో పోలిస్తే కోచ్ పాత్రే తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే జట్టులో ఉన్న లోపాలను మాత్రం రవిశాస్త్రి సరి చేయలేకపోయాడని స్పష్టం అయ్యింది. నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ లోటు వల్లనే సెమిస్ లో ఓడిపోయినట్టుగా రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి ఇన్నాళ్లు కోచ్ గా ఉండి సాధించింది ఏమిటి? అనే ప్రశ్నకు ఆయనే అవకాశం ఇచ్చాడు.
ఇక రవిశాస్త్రిని ఒక తాగుబోతుగా చూస్తున్నారు ఫ్యాన్స్. దానికి ఆయనే అవకాశం ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమైన వ్యవహారం. అయితే జాతీయ జట్టు కోచ్ గా ఉన్న వ్యక్తి అలాంటి అవకాశం ఇవ్వడం మాత్రం సమర్థనీయం కాదు.
మరోవైపు కోచ్ జాబ్ కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది బీసీసీఐ. అత్యంత భారీ వేతనం ఉన్న జాబ్ అది. ఎనిమిది కోట్ల రూపాయలకు పైస్థాయి వార్షిక వేతనం అందుకుంటున్నాడు రవిశాస్త్రి. పెద్దగా పొడిచేందుకు బాధ్యతలూ లేవు!
కేవలం కెప్టెన్ కు జీ హుజూర్ అంటూ ఉంటే చాలు. అయితే ఇప్పుడు రవిశాస్త్రి కోచ్ గా కొనసాగడానికి కారణమైన కొహ్లీకే కెప్టెన్సీ ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొహ్లీని కనీసం వన్డేల వరకూ అయినా తప్పేంచేసి రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అదే జరిగే పక్షంలో కోచ్ మార్పు కూడా ఖరారు అయినట్టే!