ఓ ప్రాజెక్టును చప్పగా ఎలా మార్చాలో ఓంకార్ ను చూసి తెలుసుకోవచ్చు. అవును.. కాస్తో కూస్తో హైప్ ఉన్న రాజుగారిగది-3 ప్రాజెక్ట్ ను పూర్తిగా నీరుగార్చేశాడు ఈ దర్శకుడు. తన చేతులారా సినిమాపై అంచనాలు తగ్గించేశాడు.
రాజుగారి గది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది-2లో నాగార్జున, సమంత లాంటి స్టార్ట్స్ నటించారు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే, రిలీజ్ కు ముందు ఆ సినిమాకు కూడా చాలా హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ రాజుగారి గది-3కి ఆ అవకాశం లేకుండా పోయింది. అవును.. ఇప్పుడీ ప్రాజెక్టులో స్టార్ ఎట్రాక్షన్ లేదు.
రాజుగారి గది-3లో ముందుగా తమన్నాను అనుకున్నారు. కానీ చిన్న బాలీవుడ్ ఆఫర్ రావడంతోనే ఆమె చెక్కేసింది. ఆమె స్థానంలో కాజల్ లేదా తాప్సిని తీసుకొని ఉంటే సినిమాపై అంచనాలు అలానే కొనసాగి ఉండేవి. కనీసం నందిత శ్వేత లాంటి అమ్మాయిని తీసుకున్నా ఉన్నంతలో బెటర్ గా ఉండేది. కానీ అందర్నీ కాదని అవిక గౌర్ ను ఎంపిక చేశాడు ఓంకార్.
అవికాగౌర్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయారు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తర్వాత ఆమె పూర్తిగా తెలుగు సినిమాకు దూరమైంది. ఎంచక్కా తనకు ఇష్టమైన హిందీ సీరియల్స్ చేసుకుంటోంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి తన సినిమాలో మెయిన్ లీడ్ గా పెట్టుకున్నాడు ఓంకార్. అలా రాజుగారి గది-3 సినిమాపై అంచనాల్ని తన చేతులతో తానే తగ్గించేశాడు.