ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆయన అక్కడ నుంచి తిరిగి వచ్చేలోపే కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఏకంగా పదకొండు మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలతో స్పీకర్ వద్దకు చేరారనే వార్తలు కలకలం రేపుతూ ఉన్నాయి.
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలను ఇచ్చారు. వాటి విషయంలో అధికార పక్షం ఎలా స్పందించాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉంది. వారి రాజీనామాలు ఆమోదం పొందితే కుమార ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే.
తాజాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలను సంధిస్తున్నారట. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి, ఆయన కూతురు సౌమ్యారెడ్డిలతో పాటు పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తున్నారట. మొత్తంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలతో స్పీకర్ ను కలుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
వారంతా రాజీనామాలు ఇస్తే కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్టే. వెనుకంటే భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా రామలింగారెడ్డికి మంత్రిపదవి దక్కలేదు. ఇదివరకూ ఆయన హోంమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు కనీసం ఎలాంటి మంత్రిపదవీ ఇవ్వకపోవడంతో అసహనంతో ఉన్నట్టున్నారు.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తన సత్తాను గట్టిగానే చూపించింది. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు వచ్చాయని స్పష్టం అవుతోంది.