భలే బాబు: అప్పుడు జోకులు.. ఇప్పుడవే నిజాలు

ఓటింగ్ తర్వాత, ఎన్నికల ఫలితాల ముందు చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనంటూ అధికారులపై అజమాయిషీ చలాయించాలని చూశారు, ఈసీతో గొడవలు పెట్టుకుని మరీ సమీక్షలు, సమావేశాలంటూ కాలం…

ఓటింగ్ తర్వాత, ఎన్నికల ఫలితాల ముందు చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనంటూ అధికారులపై అజమాయిషీ చలాయించాలని చూశారు, ఈసీతో గొడవలు పెట్టుకుని మరీ సమీక్షలు, సమావేశాలంటూ కాలం గడిపారు. అప్పుడే బాబుపై చాలా సెటైర్లు పడ్డాయి. బాబుకి పూర్తిగా మతి భ్రమించిందని, అధికారం లేకపోయినా కూడా సమీక్షలకు దూరంగా ఉండలేరని, ఆయన కోసం ఓ సమాంతర అసెంబ్లీని టీడీపీ ప్రత్యేకంగా రూపొందించుకోవాలని వైసీపీ నేతలు చెణుకులు విసిరారు.

చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. చంద్రబాబు, ఆయన భజనపరుల వ్యవహారం దీన్నిరుజువు చేస్తోంది. బాబు ఇంట్లో ఉన్నా.. పర్యటనలకు వెళ్లినా జనం నువ్వే మా సీఎం అంటున్నారంటే.. ఆయన్ను ఇంకా భ్రమలోనే ఉంచే ప్రయత్నాలు సక్సెస్ ఫుల్ గా జరుగుతున్నాయని అర్థమవుతోంది. గల్లా అరుణ వంటి సీనియర్లు కూడా మీరే మా సీఎం అని బాబుతో అన్నారంటే, టీడీపీ నేతల మానసిక పరిస్థితిపై కూడా జాలి కలగక మానదు. ఇవి చాలదన్నట్టు.. చంద్రబాబు రోజువారీ సమీక్షలు, కార్యకర్తల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమల్లో బతికేస్తున్నారు. దీనికి పరాకాష్ట రైతు సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కమిటీ వేశానని చెప్పడం.

ఐదేళ్లపాటు ఆయన సక్రమంగా పనిచేసి ఉంటే.. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే రైతులకు సమస్యలు ఎందుకు ఎదురవుతాయి. ఈమాత్రం లాజిక్ మిస్సైన బాబు అండ్ కో.. కమిటీల పేరుతో మరో ఎపిసోడ్ కి తెరతీసింది. వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కమిటీకి నాయకుడట. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి విత్తనాలు, సాగునీటి కొరత, విద్యుత్ కోతల వంటి సమస్యలపై సమీక్ష చేస్తుందట.

చివరాఖరి కామెడీ ఏంటంటే విత్తనాల కొరత ఉన్నచోట్ల టీడీపీ నాయకులు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలట. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా. ఐదేళ్లు అధికారంలో ఉండగా చేయాల్సిన పనిని, ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఓడిపోయాక మొదలుపెడతామంటారా? నెల తిరక్కుండానే వైసీపీపై చేస్తున్న దుర్మార్గమైన విమర్శలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ అంటూ బాబు చంకలు గుద్దుకోవడం చూస్తుంటేనే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. బాబుని ఇలాగే వదిలేస్తే.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతానంటూ మారాం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!