ఇంకో ఐదేళ్లపాటు టీడీపీకి ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయాలి, అదే సమయంలో నామ్ కే వాస్తే ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకుని అధికారపక్షంపై విరుచుకుపడాలి. అంటే లోకేష్ వ్యాఖ్యలు సంచలనం కావాలి, ఆయనకు బోల్డంత ప్రచారం కావాలి. దీనికోసం సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు చినబాబు.
తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ప్రతిరోజూ కనీసం మూడు సంచలమైన కామెంట్లు వదులుతున్నారు లోకేష్. వాటిని విస్తృతంగా ఫేస్ బుక్, ట్విట్టర్, అనుకూల వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. అదేరోజు వైసీపీ నుంచి ఎవరైనా లోకేష్ కామెంట్లపై రియాక్ట్ అయితే వాటిని కూడా ప్రముఖంగా చూపిస్తారు. ఇక తర్వాతి రోజు పని న్యూస్ పేపర్లు పూర్తిచేస్తాయి. లోకేష్ ఇలా అన్నారు, దీనికి అధికార పక్షం భుజాలు తడుముకుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి తోక పత్రికలు కథనాల్ని వండి వారుస్తాయి.
గత 10రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. అసలు లోకేష్ ఎందికిలా అసంబద్ధంగా, అవసరం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అనుకుంటున్న చాలామందికి ఇదే సమాధానం. లోకేష్ కి ప్రచారం కావాలి, లోకేష్ మాటలు సంచలనంగా మారాలి. కేవలం ఇదే టార్గెట్ గా పెట్టుకుని ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు చినబాబు. దాన్ని పెద్ద విశేషంగా, విప్లవంగా చూపిస్తూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసేస్తోంది.
అయినా ఇలా ఎంతకాలం లోకేష్ తో ఈ నాటకాలు ఆడిస్తారో అర్థంకావడం లేదు. ప్రజల ముందుకొచ్చి మాట్లాడలేని వ్యక్తి చేత, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టించి, వాటిని తిరిగి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రొజెక్ట్ చేయించి నానా ఆపసోపాలు పడుతున్నారు చంద్రబాబు. కొడుక్కి జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తున్న చంద్రబాబు కల కల్లగానే మిగిలిపోవడం ఖాయం.
సొంత పార్టీ నుంచే సారథ్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చినబాబు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకి ఇప్పుడేకాదు, భవిష్యత్తులో కూడా ట్విట్టరే దిక్కు అయింది.