‘తానా’లో బీజేపీ – టీడీపీ ముచ్చట్లు.!

అమెరికాలో 'తానా' సందడి కాస్తా, రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి రాజకీయ ప్రముఖుల తాకిడి 'తానా'లో గట్టిగానే కన్పిస్తోంది. అయితే, గతంలోనూ రాజకీయ నాయకులు 'తానా'లో హల్‌చల్‌ చేశారని నిర్వాహకులు పాత పాటే పాడుతున్నారనుకోండి..…

అమెరికాలో 'తానా' సందడి కాస్తా, రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి రాజకీయ ప్రముఖుల తాకిడి 'తానా'లో గట్టిగానే కన్పిస్తోంది. అయితే, గతంలోనూ రాజకీయ నాయకులు 'తానా'లో హల్‌చల్‌ చేశారని నిర్వాహకులు పాత పాటే పాడుతున్నారనుకోండి.. అది వేరే సంగతి. ప్రధానంగా ఈసారి 'తానా' సందర్బంగా టీడీపీ నేతలతోపాటు, బీజేపీ నేతల హల్‌చల్‌ ఎక్కువవడం గమనార్హం.

బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీనేత పయ్యావుల కేశవ్‌ 'తానా' కోసం అమెరికా వెళ్ళి, అక్కడ రాజకీయ మంతనాలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ఖాళీ చెయ్యాలనే ఆలోచనతో వున్న బీజేపీ, టీడీపీ ముఖ్యనేతల్ని తమవైపుకు తిప్పుకునే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టేసింది.. నలుగురు రాజ్యసభ సభ్యుల్ని టీడీపీ నుంచి బీజేపీలో కలిపేసుకుంది కూడా. ఎమ్మెల్యేలనీ అలాగే బీజేపీలో కలిపేసుకోవాలన్నది బీజేపీ వ్యూహం.

మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ – టీడీపీ నేతలు ఎక్కడ తారసపడినా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వుండాలి. కానీ, 'తానా' సందర్భంగా ఇందుకు భిన్నమైన కెమిస్ట్రీ కన్పిస్తోంది బీజేపీ – టీడీపీ నేతల మధ్య. టీడీపీ ఎన్నో సంక్షోభాల్ని ఎదుర్కొందనీ.. ఇది అసలు సంక్షోభమే కాదనీ.. ఓటమిని విశ్లేషించుకుని ముందడుగు వేస్తామనీ పయ్యావుల కేశవ్‌ చెబుతోంటే, పయ్యావుల కేశవ్‌ని బీజేపీలోకి విష్ణువర్ధన్‌రెడ్డి ఆహ్వానించేస్తున్నారు.

'తానా' వేదికగా 'ఆపరేషన్‌ కమలం' అమలు చేస్తారా.? అన్న ప్రశ్నకు విష్ణువర్ధన్‌రెడ్డి.. 'ఆ పని మేం ఇండియాలోనే చేస్తున్నాం.. అమెరికాలో ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. అన్ని అంశాలతోపాటూ రాజకీయ అంశాలూ చర్చకు వస్తాయ్‌..' అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. 'టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్‌లో మాట్లాడుకుంటే పనైపోతుంది' అని ఆయన చెప్పడం గమనార్హం.

అన్నట్టు, 'తానా' వేడుకల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొననున్న విషయం విదితమే. ఆయనతో భేటీ అయ్యేందుకూ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారట. 'పవన్‌ కళ్యాణ్‌నీ కలుస్తాం.. అందులో తప్పేముంది.?' అంటున్నారు 'తానా' కోసం అమెరికా వెళ్ళిన కొందరు బీజేపీ ముఖ్యనేతలు.  

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!