ఇలాంటివారిపై అనర్హత వేటు వేయక్కర్లేదా?

'అనర్హత వేటు' అనే పదం చాలా పాపులర్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తుండటం మనం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్‌కు, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తుంటారు.…

'అనర్హత వేటు' అనే పదం చాలా పాపులర్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తుండటం మనం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్‌కు, గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తుంటారు. స్పీకరుకు మొర పెట్టుకుంటారు. కోర్టులకు వెళుతుంటారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయించడానికి నాయకులు నానా పాట్లు పడుతుంటారు. ఇదంతా పెద్ద ప్రహసనం. పొద్దున లేస్తే నీతులు చెప్పే  ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, స్పీకర్లు ఎవరూ ఈ విషయం పట్టించుకోరు. సరే… ఇదిలా పక్కనుంచితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులే కాదు, ప్రజాసేవకులు కూడా. తాము ప్రజాసేవలో తరించడానికే రాజకీయాల్లోకి వచ్చామని ప్రవచనాలు చెబుతుంటారు. వీరు చేస్తున్న 'ప్రజాసేవ'కు భారీగా జీతాలు తీసుకుంటున్నారు. ఇతరత్రా అనేక ఉచిత, రాయితీ సౌకర్యాలు అనుభవిస్తున్నారు.

ప్రజల మేలు కోసం చట్టసభల్లో శాసనాలు చేసే ఈ ప్రజాప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాలి కదా. గొప్ప ఆశయాలు వల్లించే వీరు హుందాగా ఉండాలి కదా. ఎవరో కొద్దిమంది ఇలా ఉండొచ్చేమోగాని ఎక్కువమంది గూండాలుగా, రౌడీలుగా ముద్రపడుతున్నారు. ప్రజలపై దాష్టీకం చేస్తున్నారు. ఉద్యోగులను కొడుతున్నారు. అధికారుల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటివారిపై అనర్హత వేటు వేయనక్కర్లేదా? పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినా ఎలాగూ శిక్షలు పడవు. పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కున నాయకులే దర్జాగా తిరుగుతుంటే కొట్టడం, దాడులు చేయడం మొదలైన 'పెట్టీ కేసులు' ఎవరు పట్టించుకుంటారు?

మహారాష్ట్రలో కాంగ్రెసు ఎమ్మెల్యే నితీష్‌ రాణే ఓ ఇంజినీరుపై బురదపోసి బ్రిడ్జికి కట్టేశాడు. ఇది అధికారిపై దాడి చేయడమే కదా. పైగా ఆ సమయంలో ఇంజినీరు విధుల్లో ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే కుమారుడు. తాను మాజీ ముఖ్యమంత్రి కుమారుడినన్న పొగరో, సహజంగా రౌడీతత్వమో తెలియదు. పైగా ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లో సీనియర్‌ కూడా. ఈ ఘటన తరువాత ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎలాగూ అరెస్టు చేస్తారని ఈ పని చేసుంటాడు. కాని ఏం ప్రయోజనం? బెయిల్‌ మీద బయటకు వచ్చి తిరుగుతాడు. కొన్నాళ్ల తరువాత కథ కంచికి పోతుంది.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రౌడీగా పేరుపడ్డారు. అతను ఓ మహిళా అధికారిపై చేయిచేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈమధ్యనే ఏపీలో ఒక వైకాపా ఎమ్మెల్యే పత్రికా విలేకరిని బండబూతులు తిట్టాడు. ఆ బూతులు వింటే ఇతను ప్రజాప్రతినిధా? అని ఆశ్యర్యం కలుగుతుంది. ఇదివరకు ఇతను టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.ఈ మధ్యనే తెలంగాణలో అటవీ శాఖకు చెందిన మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే సోదరుడు, జిల్లా పరిషత్‌ వైఎస్‌ ఛైర్మన్‌ కొంతమందితో కలిసి కర్రలతో దారుణంగా దాడిచేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విధి నిర్వహణకు వచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారు.

అందుకే చట్టసభల ప్రతినిధులు ఇలాంటి పైశాచికమైన పనులు చేసినప్పుడు వారిపై అనర్హత వేటు వేయడమే కాకుండా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి కూడా  అనర్హులను చేస్తే  ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్రమంగా సంపాదించుకోవడమే కాకుండా ఆ పొగరుతో అధికారులపై దాడులు చేస్తున్నారు. అధికారులు తప్పులు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. ఇంకా కావలంటే  కోర్టులకు వెళ్లాలి. అంతేగాని చట్టసభలకు ఎన్నికైనంతమాత్రాన హీరోలు కారు. అసెంబ్లీల్లో, పార్లమెంటులో క్రిమినల్స్‌ పెరుగుతున్నారు. చట్టసభల్లో ప్రస్తుతం ధనికులు, నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చట్టసభలు పవిత్రమని కొందరు చెబుతుంటారు. ఆ పవిత్రత ఏనాడో అంతరించింది. ఫిరాయింపుదారులతో, క్రిమినల్స్‌తో నిండిన సభల్లో ఇంకా పవిత్రత ఎక్కడ ఉంది? 

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!