ఈమధ్య వచ్చిన బ్రోచేవారెవురా అనే సినిమాకు ఇది ట్యాగ్ లైన్. సరిగ్గా ఇలాంటి సినిమానే ఏపీ రాజకీయాల్లో కూడా నడుస్తోంది. బ్రోచేవారెవరురా అంటూ ప్రజలు (ఓ వర్గం మాత్రమే) చంద్రబాబు ముందు క్యూ కడుతుంటే… వాళ్లను అక్కున చేర్చుకుంటూ బాబు ఓదార్పులు. తెరపై చూడ్డానికి ఇది చిత్రమే చలనము అనే రీతిలో కనిపిస్తుంది. తెరవెనక మాత్రం ఇది చలనమే చిత్రం, అంటే రివర్స్ లో జరుగుతుందన్నమాట.
దశలవారీగా ఆరుగురు చొప్పున లోపలకి పంపిస్తారు.. ఎవరైనా బొకేలు తెస్తే అందిస్తారు, అవి కూడా లేవనుకుంటే తెలుగుతమ్ముళ్లే గేట్ బయట ఉచితంగా రోజా పూలు అందిస్తారు. వాటిని తీసుకెళ్లి లోపల కూర్చున్న బాబుకు అందించాలి. ఆ వెంటనే అమ్మా స్టార్ట్ చేయండి అనే శబ్దం ఎక్కడ్నుంచో వినిపిస్తుంది. అంతే.. ఒక్కసారిగా గుంపులోంచి ఓ ఇద్దరు ముగ్గురు మహిళలు ఏడుపులు అందుకుంటారు. ఇక అక్కడ్నుంచి యాక్షన్ షురూ.
ఏడ్చే వాళ్లను బాబు ఎంచక్కా ఓదారుస్తుంటారు. వాళ్ల భుజాలపై చేతులు వేసి భరోసా ఇస్తున్నట్టు తడుతుంటారు. దీంతో వాళ్ల పెడబొబ్బలు మరింత పెరుగుతాయి. అప్పటివరకు తమ సీన్ కోసం ఎదురుచూస్తున్న మహిళా పోలీసులు అప్పుడే రంగంలోకి దిగుతారు. ఏడుస్తున్న మహిళల్ని మెల్లగా స్టేజ్ దింపి మరో గదిలోకి పంపిస్తారు. ఆ తర్వాత మరో బ్యాచ్ వస్తుంది, పూలు ఇస్తుంది, కొంగు తడిపేసుకుంటుంది.. ఇలా సాగుతుంది తెరపై చిత్రం.
ఇక తెరవెనక చిత్రం చూస్తే అది మరో సినిమాను తలపిస్తుంది. అప్పటివరకు గుక్కపట్టి ఏడ్చిన బ్యాచ్ అంతా ఒక్కసారిగా మారిపోతుంది. మరో గదిలోకి షిఫ్ట్ అయిన మహిళలంతా అప్పటివరకు ఏడ్చిన ఏడుపును వెంటనే ఆపేస్తారు. నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుకుంటారు. అంతలోనే ఓ వ్యక్తి ఆ గదిలోకి వస్తాడు. సాధారణంగా అతడు పసుపు రంగు షర్ట్ వేసుకుంటాడు. అతడు వచ్చిన వెంటనే మహిళలంతా లేచి నిల్చుంచారు. అతడి చుట్టూ గుమిగూడుతారు.
అదేదో అతడిపై ఉన్న భక్తి, గౌరవంతో కాదు. అతడిచ్చే డబ్బు కోసం. అవును.. సదరు వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోవడం, అట్నుంచి అటు బయటకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోతాయి. అందరి చేతుల్లో 2వేల రూపాయల నోట్లు తళతళలాడుతుంటాయి. బయటకు వెళ్లిన మహిళలకు అక్కడ భోజనం సిద్ధంగా ఉంటుంది. కడుపారా తినేసి, డబ్బులు పట్టుకొని అంతా వెళ్లిపోతారన్నమాట.
ఓడిపోయిన తర్వాత ఓటమిపై విశ్లేషణలు చేయాల్సింది పోయి, చంద్రబాబు ఇలా బూటకపు ఓదార్పులకు తెరదీశారు. మొన్నటివరకు కరకట్టపై నడిచిన ఈ ప్రహసనం, తాజాగా కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయింది. బ్రోచేవారెవరురా అంటూ ఓ వర్గం ప్రజలు బాబు ముందు కన్నీరు కారుస్తుంటే, బాబు వాళ్లకు చలనచిత్రం చూపిస్తున్నారు.