దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి ఒక్క ఏపీకి తప్ప. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన అనాలోచిత ఆలోచనలతో, అస్తవ్యస్త విధానాలతో రాజధాని ఏర్పాటు కాలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాల్సింది లేదా మరోచోట ఏర్పాటు చేయాల్సింది. కానీ ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం మూడు రాజధానులు అన్నాడు. ఇదో పెద్ద వివాదమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వివాదాన్ని ఆట వస్తువుగా చేసి ఆడుకుంది. రైతులు ఆమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలంటూ సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే కదా.
చివరకు అమరావతి రైతులు హైకోర్టుకు వెళితే అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని, దాని నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు నెలల గడువు ముగిసిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు అనే తన విధానానికే కట్టుబడి ఉంది. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన పట్టును సమర్థించుకునేందుకు.. సాధించుకునేందకే ప్రాధాన్యం ఇస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమేరేగింది. రాజధాని రైతులు.. ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు.. అమరావతికే మొగ్గు చూపింది. రాజధాని అమరాతినే అభివృద్ది చేయాలని.. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు.. వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అప్పగించాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ చేసింది ఏమీ కనిపించడం లేదు.
దీంతో మరోసారి.. రైతులు ఉద్యమించేందుకు రెడీ అవుతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైసీపీలో జరుగుతున్న చర్చలను బట్టి.. దసరా తర్వాత లేదా.. అదే రోజు నుంచి సీఎం జగన్ విశాఖలోనే ఉంటారని.. అక్కడ నుంచి పాలన సాగిస్తారని తెలుస్తోంది. ఇది అధికారికంగా కాకుండా.. అనధికారికంగా అక్కడ నుంచి పాలన సాగిస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
దీనిని బట్టి.. సర్కారు మూడు రాజధానులకే మొగ్గు చూపుతోందని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే ఆ తీర్పు ఎంత కాలానికి వస్తుందో తెలియదు. ఈలోగా ఎన్నికలు ముంచుకొస్తాయి. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా హై కోర్టు మాదిరిగానే అమరావతినే డెవెలప్ చేయాలని చెబితే ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? జగన్ ప్రభుత్వ టర్మ్ ముగిసేలోగా ఏపీకి అధికారికంగా రాజధాని ఉంది అనే వార్త వినగలమా?