తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి హంగూ ఆర్భాటాలు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయని, ఆయన సీఎంగా ఉన్నప్పుడే అనుకుంటే ఇప్పటికీ ఆయన మందీమార్బలం తమను ఇబ్బంది పెడుతూ ఉందని కొంతమంది రైతులు, మత్య్సకారులు మంగళగిరి ఎమ్మెల్యేల ఆళ్ల రామకృష్ణా రెడ్డిని కలవడం ఆసక్తిదాయకంగా ఉంది.
చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో ఆయన భద్రతా సిబ్బంది తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉందని వారు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయటకు వచ్చేందుకు రెండు మూడు గంటల ముందు నుంచినే అక్కడ హడావుడి మొదలవుతూ ఉందని.. అటువైపు ఎవరినీ రానివ్వకపోవడం చేస్తారని, రాత్రి పది తర్వాత అటువైపు ఎవరినీ అడుగే పెట్టనివ్వరని వారు ఆళ్లకు చెప్పుకున్నారు.
చంద్రబాబు నివాసం వైపు వాళ్లకేం పని ఉంది? అనొచ్చు. చంద్రబాబు నాయుడు ఉంటున్న కరకట్ట భవంతి చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల పంటలు పండించేవారు పండించుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని చంద్రబాబు భద్రతా సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతోందట. కృష్ణానదిలో చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులు కూడా చంద్రబాబు భద్రతా సిబ్బంది తీరుతో ఇబ్బందులు పడుతూ ఉన్నారట.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా కాదు. అయినా అదే తీరు కొనసాగుతూ ఉందని ఆళ్లను కలిసి బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆళ్ల స్పందిస్తూ చంద్రబాబు నాయుడు నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల వరకూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించకపోతే తనే ఆయన ఇంటిముందు ధర్నాకు దిగుతానంటూ వారికి చెప్పినట్టుగా సమాచారం.