ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ కంప్లీట్ అయి, అది థియేటర్లలోకి వచ్చేంత వరకు మరో ప్రాజెక్టు టచ్ చేయడు. కానీ ఆర్-ఆర్-ఆర్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. అందులో కొంత నిజం కూడా ఉంది. కానీ తారక్ మాత్రం మరోసారి త్రివిక్రమ్ కు ఓటేశాడు.
అవును.. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టు తర్వాత కుదిరితే మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు. పుట్టినరోజు సందర్భంగా రాత్రి తనను కలిసేందుకు ఇంటికొచ్చిన అభిమానులతో పిచ్చాపాటీ మాట్లాడిన తారక్, మాటల మధ్యలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా ఇదే. ఆ సినిమా రికార్డులు తిరగరాయలేదు. అలా అని ఫ్లాప్ కూడా కాదు. కానీ త్రివిక్రమ్ టేకింగ్ మాత్రం తారక్ కు నచ్చినట్టుంది. పైగా అరవింద సమేత టైమ్ లోనే మరో సినిమా చేద్దామని ఇద్దరూ అనుకున్నట్టున్నారు. అందుకే ఆర్-ఆర్-ఆర్ తర్వాత త్రివిక్రమ్ కే ఛాన్స్ అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్.
అయితే ఈ ప్రాజెక్టు ఫిక్స్ అని అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఎన్ని సమీకరణాలు మారుతాయో చూడాలి. పైగా చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు మరి.