వార్తా పత్రికల వల్ల కరోనా వచ్చే అవకాశమే లేదని ఇంత కాలం చంద్రజ్యోతి ప్రచురించిన కథనాలన్నీ అవాస్తవాలేనా అంటే…అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు, పత్రికలను తాకడం కంటే డిజిటల్ వినియోగమే మంచిదని స్వయానా చంద్రజ్యోతే రాయడం గమనార్హం. పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ఇప్పటికే పెద్దసంఖ్యలో చందాదారులు “మీ పత్రికలు వద్దు బాబోయ్. మానేయండి మహాప్రభో” అని నినదించారు.
తాజాగా చంద్రజ్యోతిలో కరెన్సీపై ప్రచురించిన వార్త చదివితే ప్రజల భయం నిజమే అనిపిస్తుంది. అంతేకాదు, పత్రికలను మాన్పేయించిన వారి నిర్ణయం సరైందేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దీంతో అన్ని పత్రికల సర్క్యులేషన్ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పత్రికా యజమానులకు భయం పట్టుకుంది. తమ పత్రికలను శానిటైజ్ పంపుతున్నామంటూ ప్రజల్ని నమ్మబలికారు. కానీ పత్రికా యజమానులు ఎన్ని సర్కస్ ఫీట్లు వేసినా కరోనా ముందు వాళ్లు పప్పులుడకలేదు.
కానీ జనం వద్దకు వచ్చేసరికి చంద్రజ్యోతి నిజాల్ని బయట పెడుతూ, భయపెడుతోంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాని నుంచి రక్షణ పొందేందుకు కరెన్సీ కంటే డిజిటల్ లావాదేవీలే మంచిదంటూ ఓ కథనాన్ని చంద్రజ్యోతిలో రాసుకొచ్చారు.
ఎక్కువ మంది చేతులతో డబ్బులు తీసుకునే వారికి కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న వార్తలతో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైందని, పాలు, కిరాణా, కూరగాయలు మొదలుకొని మెడికల్ షాపులు, కేబుల్ టీవీ ఆపరేటర్ల వరకూ చేత్తో డబ్బు తీసుకునేవారిలో చైతన్యం తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారని చంద్రజ్యోతిలో పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని అన్ని పత్రికలు రాసినప్పటికీ చంద్రజ్యోతి మాత్రం డిజిటల్ లావాదేవీలు శ్రేయస్కరమని బలమైన సమాచారాన్నితీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
కరెన్సీ నోట్లను తప్పనిసరిగా శానిటైజ్ చేసేలా అవగాహన కల్పించాలని , వీలైనంత వరకూ డిజిటల్ లావాదేవీలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ ఆదేశించినట్టు ఆ వార్తలో పేర్కొన్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తోందని నిర్ధారణ కాలేదని, కానీ డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించినట్టు రాశారు.
మరి వార్తా పత్రికల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది కదా! వార్తా పత్రికల వల్ల కరోనా రాదని ఏ విధంగా చెబుతారు? కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టుగానే ఈ-పేపర్, డిజిటల్ మీడియాను ప్రోత్సహించాల్సిన అవసరం లేదా? మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా వ్యవస్థలో మాత్రం మార్పు రావాలని ఎందుకనుకోకూడదు? ఒకరిద్దరు యజమానుల కోసం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను అడ్డుకోవడంలో లోగుట్టు ఏంటి? కరోనా దెబ్బతో వార్తా పత్రికలు అస్తమించే దశ దగ్గర్లోనే ఉంది. డిజిటల్ మీడియా సూర్యకాంతి వలే తేజోవంతమయ్యే దశ ప్రారంభమైంది.
ఏ విధంగానైతే కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారో…అదే విధంగా పత్రికల విషయంలో కూడా ప్రాణాలను కాపాడుకునేందుకైనా ఈ-పేపర్లను చూడటం అలవరచుకోవాలి. అలాగే డిజిటల్ మీడియాను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉండొచ్చు. స్వార్థం కోసం కొందరు పనిగట్టుకుని వార్తా పత్రికల వల్ల అది రాదు, ఇది రాదు అంటూ రాస్తున్న అబద్ధాలను ఎప్పటికీ నమ్మక పోవడం మంచిది.
-సొదుం