తండ్రి కలను జగన్ ఎప్పుడు నెరవేరుస్తారు?

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వైఎస్ జగన్. గతంలో పెద్దాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని కొత్తపుంతలు తొక్కించారో, అంతకంటే మెరుగ్గా వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని…

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వైఎస్ జగన్. గతంలో పెద్దాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని కొత్తపుంతలు తొక్కించారో, అంతకంటే మెరుగ్గా వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. 

అటు ప్రాజెక్టుల విషయంలో కూడా తండ్రికి తగ్గోడు అనిపించుకుంటున్నారు. గతంలో వైఎస్ఆర్ జలయజ్ఞం కోసం ఎంతలా తపించారో, ఇప్పుడు జగన్ కూడా ప్రాజెక్టుల విషయంలో అంతే తపన చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టే దీనికి పెద్ద ఉదాహరణ.

ఇలా ఎన్నో అంశాలు, కార్యక్రమాల్లో తండ్రిని తలపిస్తున్న ముఖ్యమంత్రి.. ఒకే ఒక్క విషయంలో మాత్రం తండ్రిని అనుసరించలేకపోతున్నారు. అదే రచ్చబండ. గతంలో వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వైఎస్ జగన్ మాత్రం అమలు చేయలేకపోతున్నారు.

గతంలో చంద్రబాబు ఏం చేశారు..?

ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయడం అనేది ఈ కాన్సెప్ట్. పేర్లు ఎన్ని పెట్టినా, పాలనను ప్రజల ముంగిట నిలపాలనే సదుద్దేశం ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు డయల్ యువర్ సీఎం అనే కార్యక్రమం పెట్టారు. ఒక్క ఫోన్ కాల్ రావడం ఆలస్యం.. ఆ ఒక్క ఫోన్ తోనే అర్థగంట సమయం గడిచిపోయేది. బాబుకు ప్రమోషన్ తప్ప, ప్రజలకు చేకూరిందేం లేదు. 

తర్వాత ఇదే కార్యక్రమానికి పేర్లు మార్చి ప్రజల వద్దకు పాలన అన్నారు. జన్మభూమి కార్యక్రమం అన్నారు. ఇలా బాబు ఎంత హంగామా చేసినా ఈ కార్యక్రమాల సక్సెస్ రేటు 20శాతం లోపే. అప్పటికప్పుడు వాళ్ల మనుషుల చేతే సమస్యలు చెప్పించడం, పరిష్కరించినట్టు బిల్డప్ ఇవ్వడంతోనే సరిపోయింది.

ఆ తర్వాత వైఎస్ఆర్ ఏం చేశారు..?

అప్పటివరకు చంద్రబాబు చేసిన ఈ ప్రచార ఆర్భాటం మొత్తాన్ని వైఎస్ఆర్ చుట్టి అవతల పడేశారు. రచ్చ బండ అనే సరికొత్త కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఇందులో ఆర్భాటాలు, ప్రచారాలు ఉండవు. ముందే సమస్య ఏంటనేది అధికారుల ద్వారా తెలుసుకుంటారు. రచ్చ బండ టైమ్ కు అన్ని రెడీ చేస్తారు. 

స్పాట్ లో అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం ఇస్తారు. అవసరమైతే అధికారుల సంతకాలతో పత్రాలు అందజేసే కార్యక్రమం కూడా స్పాట్ లోనే జరిగేలా రూపకల్పన చేశారు. అయితే అంతలోనే వైఎస్ఆర్ ఈ లోకాన్ని వీడారు. అలా రచ్చబండ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగిపోయింది.

ఇప్పుడు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు..?

ముఖ్యమంత్రి జగన్ మనసులో కూడా ఈ కార్యక్రమం ఉంది. నిజానికి తన తండ్రి కలల కార్యక్రమాన్ని అన్నింటికంటే ముందే ప్రారంభించాలనుకున్నారు జగన్. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే దీనికి శ్రీకారం చుట్టారు. కార్యాచరణ కూడా సిద్ధమైంది. 

తనే అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తానని కూడా ప్రకటించారు. 2019 అక్టోబర్ 2 నాటికి అంతా సిద్ధం అనుకున్న టైమ్ లో కరోనా వచ్చింది. అప్పట్నుంచి రచ్చబండ కార్యక్రమం ఆగిపోయింది. అలా ఆగిన కార్యక్రమం ఇప్పటివరకు మళ్లీ తెరపైకి రాలేదంటే దానికి కారణం కరోనా మాత్రమే.

అయితే రాబోయే రోజుల్లోనైనా రచ్చబండ మొదలవుతుందా అనేది అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే జగన్ ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు, జిల్లాల విభజన, 3 రాజధానులు, విశాఖ పరిపాలన రాజధాని, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ లాంటి ఎన్నో అంశాలున్నాయి. 

వీటితో పాటు నవరత్నాల అమలు, ప్రతిపక్షాలు సృష్టించిన కోర్టు కేసులు ఉండనే ఉన్నాయి. వీటిపై ప్రతి రోజూ అధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఇలాంటి టైమ్ లో జగన్, తన అధికార నివాసాన్ని వీడి ప్రజల మధ్యకు వస్తారా అనేది సందేహం.

అయితే ఎన్ని పనులు, ఎన్ని అడ్డంకులున్నప్పటికీ తండ్రి కలల ప్రాజెక్టు అయిన రచ్చబండను జగన్ ప్రారంభించి తీరుతారని అంటున్నారు వైసీపీ నేతలు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే రచ్చబండపై కార్యాచరణ సిద్ధమౌతుందని అంటున్నారు.