తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవిత చరమాంకంలో తను ఒకప్పుడు తీవ్రంగా ద్వేషించిన, తనను తీవ్రంగా ద్వేషించిన వారితో సత్సంబంధాలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు అలాంటి సమావేశాలు వరసగా జరుపుతూ ఉన్నారు.
ఇప్పటికే ఒకసారి తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించేందుకు వెళ్లి సుదీర్ఘ సమావేశాన్నే చంద్రబాబు నాయుడు జరిపారు. ఈ తోడలుళ్ల వ్యవహారం గురించి తెలుగు ప్రజలకు కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ను జాయింటుగా దింపారు ఈ అల్లుళ్లు. దింపిన తర్వాత సీఎం సీటును చంద్రబాబు నాయుడు తన్నుకుపోయారు.
మిగతా వాళ్లంతా చంద్రబాబుకు అనుగుణంగా తందానా అన్నారు కానీ, దగ్గుబాటి, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణలు మాత్రం చంద్రబాబుకు ఎదురుతిరిగారు. హరికృష్ణ కొంత కాలం పాటే యుద్ధం చేసి, ఆ తర్వాత విరమించుకున్నారు. చివరకు బావ పంచన చేరారు.
అయితే దగ్గుబాటికి కాంగ్రెస్ లో చేరాకా కాలం కలిసి వచ్చింది. వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన భార్య ఎంపీ ఆ పై కేంద్రమంత్రి కూడా అయ్యారు! ఒకవేళ చంద్రబాబుతో సన్నిహితంగా ఉండి ఉంటే.. దగ్గుబాటి కుటుంబానికి అలాంటి రాజకీయ ప్రాధన్యత కానీ, పదవులు కానీ దక్కేవి కావు. చంద్రబాబు వాటిని దక్కనిచ్చేవాడు కాదనేది కూడా నిష్టూరమైన నిజం.
హరికృష్ణకు మంత్రి పదవిని ఇచ్చినట్టుగానే ఇచ్చి ఆ తర్వాత ఏం చేశారు, రాజ్యసభ సభ్యుడిని చేసిన తర్వాత రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హరికృష్ణ చేసిన రాజీనామా ను చంద్రబాబు ఎలా ఆమోదింపజేశారు, హరికృష్ణను పదవీచ్యుతుడిని చేయడం, ఆయన కొడుకును అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ వస్తుండటం.. ఇదంతా చంద్రబాబు మార్కు రాజకీయం.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి చంద్రబాబుకు దూరంగా జరిగి.. చంద్రబాబు రాజకీయ శత్రువులుగా చలామణి అవుతూ కాంగ్రెస్ లో భారీ ప్రాధాన్యతను పొందారు. కాలం కలిసొచ్చి.. ఉనికిని చాటుకున్నారు.
చంద్రబాబుపై పుస్తకాలను అస్త్రాలుగా సంధిస్తూ వచ్చారు వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ పై తాము చేసిన వెన్నుపోటు అంశంలో తన పాత్ర ఎంత, ఎన్టీఆర్ పుత్రుల పాత్ర ఎంత, పుత్రికల పాత్ర ఎంత, అందరికీ మించి చంద్రబాబు పాత్ర ఏమిటనే అంశంపై పుస్తకాలు, వ్యాసాలు రాస్తూ వచ్చారు దగ్గుబాటి. అయితే కాలం మళ్లీ మారింది. దగ్గుబాటి కుటుంబం రాజకీయంగా ఉనికిని కోల్పోయింది.
రాష్ట్ర విభజన ఎపిసోడ్ ముగిసే వరకూ కాంగ్రెస్ తోనే నిలిచి పురందేశ్వరి రాజకీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. విభజన తర్వాత మిగతా కాంగ్రెస్ నేతల్లా పార్టీని తిట్టి, ఈమె బీజేపీలో అయితే చేరారు కానీ.. రాజకీయంగా ఎదుగుదల లేదు. కేంద్ర మాజీ మంత్రి అనిపించుకోవడమే తప్ప బీజేపీలో ఆమెకు పదవి యోగాలేవీ బయటకు కనిపించడం లేదు.
ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు పురందేశ్వరి. అక్కడకూ తెలుగుదేశం మద్దతు పలికినా.. ఆమె 2014లో రాజంపేట నుంచి చిత్తయ్యారు. ఇక దగ్గుబాటి మరో అడుగు వేరుగా వేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్యన గత ఎన్నికల్లో పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది.
అయితే జగన్ గాలిలో కూడా పర్చూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గలేకపోయింది. సుమారు నాలుగు వేల ఓట్ల తేడాలో వెంకటేశ్వరరావు ఓడిపోయారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయిలో పరిణామాలు మారిపోయాయి.
దగ్గుబాటి ఫ్యామిలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లైట్ తీసుకుందనే ప్రచారం జరుగుతూ ఉంది. భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో ఇలాంటి వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొందేలా లేవు. గత ఎన్నికల ముందు దగ్గుబాటికి టికెట్ కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆయన ఓటమికి పని చేసిన నేతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి చేర్చుకుంది.
స్థూలంగా పర్చూరు విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి బదులుగా మరొకరిని ఛాయిస్ గా తీసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. దీంతో వెంకటేశ్వరరావు కూడా తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం వైపు చూస్తున్నట్టుగా భోగట్టా.
ఇటీవలే దగ్గుబాటి ని చంద్రబాబు నాయుడు పరామర్శించినట్టుగా ఉన్నారు. ఆ సమయంలో… కుటుంబం చర్చలు జరిగాయని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడికి వచ్చే ఎన్నికల్లో పర్చూరు టికెట్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ చేరిక జరుగుతుందని పర్చూరు నుంచి దగ్గుబాటి తనయుడు పోటీ చేయవచ్చనేది క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్న మాట!
మరి ఇన్నాళ్లూ చంద్రబాబుపై దగ్గుబాటి కారాలూ మిరియాలూ నూరారు. దాదాపు 25 యేళ్ల నుంచి ఇదే పరంపర కొనసాగింది. అయితే .. తనయుడి రాజకీయ భవిష్యత్తు.. గతానికన్నా ప్రధానం అన్నట్టుగా దగ్గుబాటి కూడా ఇప్పుడు తిరిగి చంద్రబాబుతో పూర్తిగా చేతులు కలపడానికి సమాయత్తం అవుతున్నట్టుగా విశ్లేషణ వినిపిస్తోంది.