వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేనప్పుడు, జగన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన వెంట నిలిచిన వారిలో తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఒకరు గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాటి కడప జిల్లాకు చెందిన నేతగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా, వైఎస్ కుటుంబం సన్నిహితుడిగా, జగన్ కు స్నేహితుడి తరహాలో శ్రీకాంత్ రెడ్డి జగన్ వెంట నిలిచారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన వారిలో కూడా శ్రీకాంత్ రెడ్డి ఒకరు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరసగా నెగ్గుతూ వస్తున్నారు కూడా! శ్రీకాంత్ రెడ్డికి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గట్టిగానే వల వేసింది. అయితే.. శ్రీకాంత్ రెడ్డి అటు వైపు మొగ్గు చూపలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచారు. గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో నెగ్గారు.
ఇటీవలి కాలంలో శ్రీకాంత్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త ప్రాధాన్యత పెరిగింది. రాయచోటిని జిల్లాగా చేసుకోవడం విషయంలో కూడా ఆయన పంతం నెగ్గింది. రాజంపేటను జిల్లాగా చేయాలనే డిమాండ్ ఉన్నా.. జగన్ రాయచోటి వైపే మొగ్గు చూపారు. రాజంపేటను జిల్లాగా చేయలేదని అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు కూడా తెలుపుతున్నారు కూడా! అయినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న రాయచోటి జిల్లాగా మారింది.
ఇదంతా బాగానే ఉంది కానీ, శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి దక్కలేదు? అనేది అంత తేలికగా అంతుబట్టే విషయం కాదు. నీటి పారుదల శాఖ వంటి వాటి విషయంలో శ్రీకాంత్ రెడ్డికి మంచి నాలెడ్జ్ ఉంది కూడా. సౌమ్యుడు, చక్కగా మాట్లాడగలిగేవాడు, జగన్ కు సన్నిహితుడు అనే పేరున్నా.. శ్రీకాంత్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి దక్కలేదు.
ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. బహుశా రెడ్డి కోటాలో ఈయనకు మంత్రి పదవి మిస్ అయ్యిందనే మాట వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమలో చాలా మంది రెడ్డి ఎమ్మెల్యేలున్నారు. అయితే ఇవే జిల్లాల్లో చాలా మంది బీసీ నేతలను జగన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. దీంతో రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కష్టం అవుతున్నాయి. దీంతోనే శ్రీకాంత్ రెడ్డికి పదవి దక్కలేదనేది బాగా వినిపించే విశ్లేషణ. అయితే ఇదొక్కడే కారణం కాదంటారు. గతంలో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఒక తప్పిదం ఆయనను మంత్రిని కాకుండా చేసిందనేది అంతర్గతంగా వినిపించే మాట.
అదెందుకు.. అంటే, గతంలో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటును ఓడిపోవడాన్ని ప్రస్తావించుకోవాలి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యాన్ని బట్టి.. ఆయన అలవోకగా నెగ్గాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానందరెడ్డి పై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఘన విజయం సాధించారు. దాని వెనుక జిల్లాలో నేతల వైఫల్యం మెండుగా ఉంది. రాయచోటి నుంచి కూడా అప్పుడు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలం ఉన్నా.. ఆ ఓట్లన్నీ టీడీపీ కే పడ్డాయి!
అలా ఎమ్మెల్సీ సీటు పోవడంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా.. శ్రీకాంత్ రెడ్డి అశ్రద్ధ కూడా ఉంది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంలో బాధ్యుల్లో శ్రీకాంత్ రెడ్డి కూడా ముందు వరసలో నిలుస్తారు. దీనికి సంబంధించి అప్పట్లోనే జగన్ కు అందిన రిపోర్టులను తీవ్రంగా పరిగణించారంటారు. అందుకే శ్రీకాంత్ రెడ్డి తొలి విస్తరణలో కానీ, ఆ తర్వాత కానీ మంత్రి కాలేకపోయారనే విశ్లేషణ వినిపిస్తుంది. అయితే కొంతలో కొంత ఊరట ఆయనకు చీఫ్ విప్ హోదా అయినా దక్కడం!