రాయలసీమలో పలు నీటి పారుదల ప్రాజెక్టులపై ఆధారపడి ఉన్న జలాశయాలకు ఈ సారి శ్రీశైలం నుంచి నీటి అవసరం కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉంది! గత ఏడాది, అంతకు ముందు ఏడాది కురిసిన భారీ వర్షాలు, శ్రీశైలం నుంచి గత రెండేళ్లుగా లభ్యమైన నీటి వనరు కూడా భారీగా ఉండటంతో.. ఇప్పటికీ సీమలో చాలా ప్రాజెక్టులు నీటి పరిమాణం విషయంలో నిండుగా ఉన్నాయి! ఫలితంగా ఈ ఏడాది శ్రీశైలం నుంచి నీటిని మళ్లించి నింపాల్సిన పరిమాణం తక్కువగా కనిపిస్తూ ఉంది.
గత ఏడాది శ్రీశైలం గేట్లు ఎత్తే సమయానికే కడప జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల్లో 40 శాతం నీళ్లున్నాయి! ఆ తర్వాత మిగిలిన మేర నీటిని నింపారు. ఇక ఈ ఏడాది అయితే.. ఇంకా సీమలోని రిజర్వాయర్లలో నీటి మట్టం యాభైకి పైనే ఉంది. రిజర్వాయర్లు, చెరువులు.. ఇలా ఎలా చూసినా.. చాలా వాటిల్లో నీటి మట్టాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీగా నీటిని తరలించాల్సిన అవసరం అయితే తక్కువగానే ఉంది!
ఇప్పటికే శ్రీశైలం గేట్లు ఒకసారి ఎత్తారు. అది కొద్ది సేపే అయినా.. జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడం ఒక రికార్డే. సాధారణంగా ఆగస్టు రెండో వారానికిపైన, సెప్టెంబర్ లోనో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కొన్ని గంటలసేపు అయినా ఎత్తేవారు. అయితే ఈ సారి దూకుడు చూస్తుంటే.. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంకా భారీగా వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి, హంద్రీనీవాకు కూడా నీటి విడుదల మొదలైంది.
ఇప్పటికే సీమ ప్రాజెక్టులకు అవసరమైన నీటిల్లో 50 శాతానికి పైనే స్టాకు ఉంది. ఇప్పుడు నీటి విడుదల మొదలయితే.. త్వరలోనే డ్యాములు, చెరువులు వందశాతం నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. దీంతోనే ప్రభుత్వం గేట్లు ఎత్తడానికి పూనుకుందని తెలుస్తోంది.
ఇప్పుడు రాయలసీమకు నీటి అవసరాల విషయంలో రెండో స్టెప్ ముందుకు పడాలి. అదే వీలైన చోట్ల రిజర్వాయర్లు నిర్మించడం, హంద్రీనీవా కాలువలకు చెరువులను అనుసంధానించడం. కర్నూలు జిల్లాలో రెండు చోట్ల ఇప్పటికే జగన్ సర్కారు రెండు డ్యాముల నిర్మాణానికి పూనుకుంది.
అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువలకు అరవై వరకూ చెరువులను అనుసంధానం చేసే ప్రయత్నమూ చేస్తోంది. ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకుని.. అనంతపురం జిల్లాలో మరో రెండు డ్యామ్ ల నిర్మాణం జరిగితే.. సీమకు సాగునీటి కళ మరింతగా సంతరించుకునే అవకాశం ఉంది.