ఇంటర్నెట్ విస్తృతం అయ్యాకా.. వాట్సాప్ ఒక మాధ్యమంగా బాగా పాపులర్ అయ్యాకా… ఇంటర్నెట్ లో అత్యంత హాట్ సైట్ ఏది? అంటే.. వాట్సాప్ పేరే వినిపించడం మొదలైంది! ఇంటర్నెట్ లో హాట్ సైట్ అంటే.. ఏ పోర్న్ వెబ్ సైటో అనుకోనవసరం లేదని, వాట్సాప్ కు మించిన హాట్ మరోటి ఉండదనే మాట వినిపిస్తూ వస్తోంది. అందుకు ముఖ్యకారణం.. జనాలు అందులో హాట్ హాట్ గా మాట్లాడుకోవడమే! వాట్సాప్ చాట్ వేడెక్కడం మొదలై చాలా కాలమే అవుతోంది.
ఐదారేళ్ల కిందట వరకూ .. ఇంటర్నెట్ లో చాట్ చేయాలంటే, ఫోన్ కు ఇంటర్నెట్ సేవలు కాస్త ప్రియం. దీంతో చాలా మంది మొబైల్ డేటా ను ఆఫ్ అండ్ ఆన్ మోడ్ ను తరచూ వాడే వారు. అవసరమైనప్పుడే ఇంటర్నెట్ డేటాను ఆన్ చేసుకునే రోజులవి! లేదంటే… ఇంటి వైఫై కనెక్షన్ తో కంప్యూటర్లో ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యి.. చాట్ చేసుకోవాల్సి వచ్చే రోజులవి. అయితే రోజులు మారాయి. ఇంటర్నెట్ చౌక అయ్యింది, అన్ని ఇంటర్నెట్ సైట్లూ యాప్స్ గా చేతిలోకి వచ్చేశాయి!
ఆ స్థితిలో.. వాట్సాప్ ద్వారా ఎన్నో అవసరమైన విషయాలు, మరెన్నో అనవసరమైన విషయాలే కాదు, హాట్ చాట్ చేసుకోవడం కూడా జనాలకు తేలికగా మారింది! దీంతోనే.. వాట్సాప్ కు హాట్ సైట్ గా పేరొచ్చింది. మరి ఏదో సెక్స్ అనుభవం కోసం తాపత్రయపడే వయసులోనే కాదు, ఇంటర్నెట్ సేవలు విస్తృతం అయ్యే కొలదీ.. సెక్స్ టింగ్ కూడా మనుషులకు ఒక అలవాటుగా మారింది.
ప్రేమ బంధంలోనూ, వైవాహికబంధంలోనూ, వివాహేతర సంబంధాల్లో అయినా.. సెక్స్ టింగ్ ఒక కామన్ హ్యాబిట్ అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ బంధంలో అయినా విరహం ఉంటుంది. ఆ విరహమే భావాలను వ్యక్త పరుస్తుంది. పాత సినిమాల్లో ఇలాంటి విరహాన్ని మధురమైన గీతాల రూపంలో చూపే వారు. అయితే ప్రతి ఒకరి భావ వ్యక్తీకరణా ఆ స్థాయిలో ఉండదు కదా! కాబట్టి.. విరహాన్ని అందంగా ఎక్స్ ప్రెస్ చేయడం పక్కన పెట్టి.. ఓపెన్ గా మాట్లాడేవారే ఎక్కువ మంది.
ఈ సెక్స్టింగ్ పరస్పర అంగీకారంతో ఇప్పుడు రసవత్తరమైన అనుభవాలను ఇస్తోందనేది అధ్యయనాల సారాంశం. ఏ ఉద్యోగాల వల్ల దూరదూరంగా ఉండే భార్యభర్తలకు అయినా, ప్రేమను శృంగారం వరకూ తీసుకెళ్లే వారికి అయినా, పక్క చూపులు చూసే వాళ్లకు అయినా.. సెక్స్టింగ్ మత్తెక్కించేది గా మారిందని ఇంటర్నెట్ ట్రెండ్స్ ను శృంగారశాస్త్రంతో అన్వయించే వాళ్లు చెబుతున్నారు.
ఏ సహోద్యోగులుగా ప్రేమలో పడిన వారు ఎదురెదురు కూర్చుని మూడో కంట పడకుండా.. శృంగార సంభాషణలను, సరససల్లాపాలను టెక్ట్స్ రూపంలో ఎక్సైంజ్ చేసుకోవడం, భార్యభర్తలైన వారు కూడా పచ్చిగా మాట్లాడుకోవడానికి సెక్స్టింగ్ ను మాధ్యమంగా వాడుకోవడం, ఇక ప్రేమలో డైరెక్టుగా ఎక్స్ ప్రెస్ చేసుకోలేని శృంగార వాంఛలను తెలియజేసుకోవడానికి కూడా సెక్స్ టింగ్ ఒక మార్గంగా మారిందని సామాజిక అధ్యయనకర్తలు వివరిస్తున్నారు.
మనిషికి భావవ్యక్తీకరణ ప్రతి విషయంలోనూ ఉంటుంది. దానికి శృంగారం కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ సహజ లక్షణానికి ఇంటర్నెట్, మొబైల్ యాప్స్ వీలైనంతగా ఊతం ఇస్తున్నాయంతే!