మహర్షి సినిమా ప్రమోషన్లో మహేష్ తో పాటు అంతే ప్రముఖంగా కనిపిస్తున్నాడు మరో హీరో అల్లరి నరేష్. కాలేజీ ఎపిసోడ్ లో హీరోతో పాటు కంటిన్యూగా జర్నీచేసే పాత్ర అతనిది. నిడివి తక్కువే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది నరేష్. హీరోగా వస్తున్న గ్యాప్ ని ఇలా పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ చేసి భర్తీ చేయాలనుకుంటున్న నరేష్ మహర్షి విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఒకరకంగా చూసుకుంటే దర్శకుడు, నిర్మాతలు, మహేష్ బాబు కంటే సినిమా ఫలితంపై ఈ అల్లరోడే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కామెడీ హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపిన అల్లరి నరేష్ కి తండ్రి ఈవీవీ మరణం పెద్ద షాక్. బయటి దర్శకుల సినిమాలతో నరేష్ కెరీర్ ఏమాత్రం సాఫీగా సాగలేదు. జబర్దస్త్ కామెడీలు ఎక్కువయ్యాక, నరేష్ సినిమాని థియేటర్ వరకూ వెళ్లి చూసే జనం కరువయ్యారు. దీంతో హీరోగా బ్రేక్ వచ్చింది.
ఇప్పుడా గ్యాప్ ని మహర్షితో భర్తీ చేయాలని చూస్తున్నాడు నరేష్. ఈ సినిమా హిట్ అయ్యి, తన క్యారెక్టర్ కు మంచి పేరొస్తే ఇకపై అలాంటి అవకాశాలకు కొదవ ఉండదు, ఆ తర్వాత కొన్నాళ్లకు మంచి కథతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు. ప్రస్తుతానికి నరేష్ ప్లాన్ ఇదే.
హీరోగా గ్యాప్ వచ్చిన సునీల్ కూడా ఇదే ఆలోచనతో ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేతలో నటించినా పెద్ద ఫలితం లేకపోయింది. దీంతో చిన్న సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమయ్యాడు సునీల్. ప్రస్తుతం సునీల్ పొజిషన్లో ఉన్న నరేష్ కి మహర్షి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. విచిత్రం ఏంటంటే.. అక్కడ సునీల్ కి, ఇక్కడ నరేష్ కి కామన్ ఫ్రెండ్ పూజాహెగ్డే కావడం.