అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వైద్యులు చెబుతున్నదే నిజమే అయితే…ప్రపంచానికి ఇంతకంటే ఆనందకరమైన వార్త మరొకటి లేదు. కరోనా మహమ్మారిని సంహరించే మందు కనిపెట్టామని కాలిఫోర్నియా వైద్యులు ప్రకటించారు. వాస్తవానికి కరోనా వైరస్‌పై మందు కనిపెట్టడానికి మరో ఏడాది సమయం పడుతుందని ఒకవైపు శాస్త్రవేత్తలు చెబుతుండగా, మరోవైను తాము కనిపెట్టామని ఆ వైద్యులు గట్టిగా చెప్పడం విశేషం.
కరోనా వైరస్ బాధితులను రక్షించేందుకు మందు కనిపెట్టామని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ జాకబ్ గ్లాన్‌విల్లె ప్రకటించారు. సార్స్ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన ‘యాంటీ బాడీస్’నే ఉపయోగించి తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని ‘డిస్ట్రిబ్యూటెడ్ బయో’ ల్యాబ్‌కు సీఈవోగా వ్యహరిస్తున్న ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్‌కు ఎలాగైనా సాధ్యమైనంత త్వరగా మందు కనిపెట్టాలని తాము గట్టి పట్టు పట్టామన్నారు. ఐదుగురుతో కలసి తాను ఒక బృందాన్ని ఏర్పరచినట్టు ఆయన తెలిపారు. తన బృందం ఐదు యాంటీ బాడీస్‌ను తీసుకొని లోతుగా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
తమ పరిశోధన సత్ఫలితాలను ఇచ్చిందని డాక్టర్ జాకబ్ గ్లాన్‌విల్లె తెలిపారు. సార్స్‌ను నిర్వీర్యంచేసే యాంటీ బాడీస్‌తోనే తమ ప్రయోగం ఫలించిందన్నారు. ఈ విషయాన్ని పాండిమిక్ నెట్‌ఫ్లిక్స్ తీసిన డాక్యుమెంటరీలో కనిపించిన డాక్టర్ జాకబ్ వివరించారు.
తాము కనిపెట్టిన మందు గురించి ఇంకా ఆయన అనేక విశేషాలు వెల్లడించారు. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ఎస్–ప్రొటీన్ కణాల ద్వారా ప్రవేశిస్తుందన్నారు. తాము ఉపయోగించిన యాంటీ బాడీస్, ఎస్–ప్రొటీన్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నాశనం చేసిందని డాక్టర్ జాకబ్ ఆశ్చర్యం కలిగించే విషయం తెలిపారు.
అయితే ఈ మందు మార్కెట్‌లో అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఎందుకంటే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మందు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి రావచ్చన్నారు. అంతేకాకుండా తమ ప్రయోగాలను నిర్ధారించుకునేందుకు ఇతర లాబొరేటీల్లో కూడా పరిశోధనలు చేస్తామన్నారు. ఇందు కోసం మరో రెండు లాబొరేటరీల సాయంతో తాము చేసిన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకుంటున్నామని తెలిపారు. జాకబ్ గ్లాన్‌విల్లె బృందం ప్రయోగం ఫలిస్తే కరోనా మహమ్మారిపై మానవ మేధస్సు తక్కువ కాలంలోనే పెద్ద విజయం సాధించినట్టే.