ఆనాడు కేసీఆర్ అదే మాట …ఈనాడు ఈటల అదే మాట 

ఆనాడు తెలంగాణా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్, ఈనాడు ఈటల రాజేందర్ ఒకే మాట చెబుతున్నారు. అదే ఆత్మగౌరవం. తెలంగాణా ఆత్మగౌరవం కోసం కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉద్యమం నడిపారు.…

ఆనాడు తెలంగాణా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్, ఈనాడు ఈటల రాజేందర్ ఒకే మాట చెబుతున్నారు. అదే ఆత్మగౌరవం. తెలంగాణా ఆత్మగౌరవం కోసం కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉద్యమం నడిపారు. చివరకు తెలంగాణా రాష్ట్రం సాధించి ఆత్మగౌరవం నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈనాడు ఈటల రాజేందర్ కూడా ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నాడు.

గతంలో అంటే 1982 లో కూడా ఎన్టీఆర్ కూడా ఆత్మగౌరవం నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టి విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరూ ఆత్మగౌరవం నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఆత్మగౌరవం నినాదంతోనే టీఆర్ఎస్ ను సరిగ్గా చెప్పాలంటే కేసీఆర్ ను ఢీ కొట్టబోతున్నాడు. అయితే తేడా ఏమిటంటే …ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరూ సొంత పార్టీలు పెట్టి తాము అనుకున్నది సాధించారు. ఈటల కూడా అదే దారిలో నడుస్తాడని చాలామంది అనుకున్నారు.

ఆయన అభిమానులు, అనుచరులు సొంత పార్టీ పెట్టాలని ఒత్తిడి చేశారు. కోదండరాం వంటి నాయకులు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఐక్య వేదిక ఏర్పాటు చేద్దామన్నాడు. ఈటలను కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాక ఆయనకు హీరో ఇమేజ్ వచ్చింది. ఆల్రెడీ తెలంగాణా ఉద్యమ నాయకుడిగా ఈటల మీద గౌరవం వుంది. ఆయన అవినీతిపరుడు కాదని, భూకబ్జాదారుడు కాదని కొందరు నమ్మారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి గురించి, భూ కబ్జాల గురించి మీడియాలో అనేకసార్లు కథనాలు వచ్చినప్పటికీ కేసీఆర్ ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు. కనీసం స్పందించలేదు.

కానీ ఈటల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై ఆగమేఘాల మీద విచారణ జరిపించారు. 24 గంటల్లోనే విచారణ జరిపించడం, నివేదిక తెప్పించడం, బర్తరఫ్ చేయడం జరిగిపోయాయి. హైకోర్టు ఈ చర్యలను ప్రశ్నించింది. తనపై ఆరోపణలు వచ్చి, కేసీఆర్ విచారణ జరిపించగానే అప్పుడు ఈటల చేసిన హడావుడి చూస్తే ఆయన తప్పకుండా పార్టీ పెడతాడని అనుకున్నారు. కానీ ఈటల ఎవరూ ఊహించనివిధంగా చాలా త్వరగానే బీజేపీలో చేరాడు. 

సొంతంగా పార్టీ పెట్టడానికి ఆయన ఎందుకు సందేహించాడు? పార్టీ పెట్టి విఫలమవుతానని భయపడ్డడా? ఆర్ధికంగా శక్తి లేదా ? బీజేపీ నాయకులు కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని, జైలు పంపడం గ్యారంటీ అని అంటున్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం కళ్లారా చూస్తే తన పగ చల్లారుతుందని అనుకున్నాడా ? ఆయన ఏమనుకున్నాడో సరిగా తెలియదుగాని మొత్తం మీద బీజేపీలో చేరాడు. 

కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటి గురించి కూపీ లాగుతున్నామని, జైలుకు పంపడం గ్యారంటీ అని బీజేపీ నాయకులు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అడుగు ముందుకు పడలేదు. కేసీఆర్ యూపీఏలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశాడట. అది నిజమే అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లయింది. మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ? ఈటల ఈమధ్య ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పుడు ఆయన కూడా కేసీఆర్ ను జైలుకు పంపుతామని అన్నాడట.

మరి రాబోయే రోజుల్లో మీరు (బీజేపీ), టీఆర్ఎస్ కలిస్తే నా పరిస్థితి ఏమిటని ఈటల అడిగితే, అలాంటిది జరగదని నడ్డా చెప్పాడు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. బీహార్ లో జేడీయూ, బీజేపీ కలవలేదా? ఈటల తెలంగాణా సాధన కోసం ఆనాడు టీఆర్ఎస్ లో చేరి ఉండొచ్చు. మంత్రి అయి ఉండొచ్చు. కానీ ఆయన ఒంట్లో ఉన్నది తీవ్రవాద వామపక్ష భావజాలం. అలాంటి వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరినా జైశ్రీరామ్ అనగలడా? 

ఇన్నాళ్లు మోడీని వ్యతిరేకించి, ఇప్పుడు ఆయన భజన చేయగలడా ? ఇక అలా చేస్తే ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది ? ఇప్పుడు ఈటల అనేకమంది బీజేపీ నాయకుల్లో ఒకడిగా ఉంటాడు తప్ప తనకంటూ ప్రత్యేకత ఏముంటుంది? బీజేపీలో చేరడానికి ఈటలకు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, బేషరతుగా పార్టీలో చేరుతున్నాడని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాడు. కానీ ఎలాంటి హామీ లేకుండా ఈటల ఎందుకు చేరతాడు ? ఈటల ఆత్మగౌరవం ఆయన మాటల్లో వుంది తప్ప చేతల్లో లేదనిపిస్తోంది. ఈటల వంటి నాయకుడు బీజేపీలో ఇమడగలడా అనేది సందేహమే.