జ‌గ‌న్ అప్ర‌మ‌త్తం

ముంచుకొస్తున్న యాస్‌ తుపాను నుంచి ప్ర‌జానీకాన్ని కాపాడేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధానంగా కోవిడ్ రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై తాను అప్ర‌మ‌త్తం…

ముంచుకొస్తున్న యాస్‌ తుపాను నుంచి ప్ర‌జానీకాన్ని కాపాడేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధానంగా కోవిడ్ రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై తాను అప్ర‌మ‌త్తం కావ‌డంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా ఆయ‌న స‌మాయ‌త్తం చేస్తున్నారు.  

తుపాను సన్నద్ధతపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం జగన్‌ కోరారు. కరోనా రోగులను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే చర్యలకు ఉపక్రమించాలని సూచించారు.  

ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ ఇబ్బందులొస్తే ప్రత్యామ్నాయం చూడాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన సాంకేతిక సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుపాను కదలికలను పరిశీలిస్తే స్వల్ప ప్రభావం ఉండే అవకాశముందని.. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు.

అమిత్‌షాతో సమావేశం అనంతరం తన క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.కోవిడ్‌ రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

తుపాను ప్ర‌భావిత జిల్లాల్లోని కోవిడ్ రోగుల‌ను ముందు జాగ్రత్తగా తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే చర్యలు తీసుకో వాలని సీఎం ఆదేశించారు. మ‌రీ ముఖ్యంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. 

ఆక్సిజన్‌ సిలెండర్లకు రీఫిల్లింగ్‌ చేసే ప్లాంట్లకూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని ఆయ‌న‌ సూచించారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్‌ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం ఆదేశించారు.

తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తుపాను వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను ముందే ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.