కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై మిస్టరీ కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో పరస్పర భిన్న వాదనలు వినిస్తున్నాయి. ఒకవైపు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీతో ప్రజలు అలసిపోయారని, అలాగే ఇంగ్లిష్ మందుల వైద్యులు అందించే కరోనా ట్రీట్ మెంట్ కూడా కేవలం ప్రయోగం తరహాలోనే సాగుతోందని… అలాంటప్పుడు ఆనందయ్య చేస్తున్న ప్రయోగంలో తప్పేమిటంటూ కొందరు వాదిస్తున్నారు.
ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, కరోనాను ఎదుర్కొనడానికి ఆ మాత్రం ధైర్యాన్ని ఇస్తున్న ఆనందయ్యను అభినందించాలంటూ కొందరు విద్యాధికులు కూడా వాదిస్తున్నారు. ఇక వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు, ఆవు మూత్రం తాగాలనే బ్యాచ్ మరో అడుగు ముందుకు వేస్తోంది. అర్జెంటుగా కృష్ణపట్నానికి కొందరు వెళ్తున్నారని.. వారికి ఆనందయ్య మందులోని ముడి సరుకులు చేర్చాలని వీరు వాట్సాప్ లో పిలుపునిస్తున్నారు!
ఆనందయ్యకు మందు తయారీకి ముడి సరుకుల కొరత వచ్చే అవకాశం ఉందని, అందుకే.. రాష్ట్రం నలు మూలల నుంచి ఆ ముడి సరుకులను కృష్ణపట్నానికి చేర్చాలన్నట్టుగా వీరు వైరల్ అయిపోతున్నారు. ఆలూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా ఈ వాట్సాప్ ఫార్వార్డ్ బ్యాచ్ ఒకటి అన్నింటిలోనూ తన మేధోతనాన్ని, ముందు చూపును చూపుతుంటుంది.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ నిజమే కానీ, దాన్ని ఎదుర్కొనడానికి ఈ అశాస్త్రీయమైన వైద్యం సబబు కాదని హేతువాదులు వ్యాఖ్యానిస్తున్నారు. కచ్చితమైన అధ్యయనం జరిగి నిర్ధారణ అయ్యే వరకూ కృష్ణంపట్నం ఛాయలకు కరోనా రోగులను వెళ్లనివ్వకూడదని వీరు అంటున్నారు. ఇలా సోషల్ మీడియా నిలువునా చీలి కొట్టుకుంటూ ఉంది.
మరోవైపు ఈ మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ వాళ్ల పరిశోధన ప్రారంభం అయ్యింది. మరోవైపు ఐసీఎంఆర్ బృందం కూడా రంగంలోకి దిగుతోంది. ఈ మందులోని శాస్త్రీయతను అవి ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ సానుకూల నివేదికలను ఇస్తే.. కృష్ణపట్నం కిక్కిరిసిపోయి, కల్లోలం మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు!