కాలం కలిసిరాక టాలీవుడ్ కు దూరమైంది రకుల్ ప్రీత్ సింగ్. స్పైడర్ సినిమా డబుల్ డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం మహేష్ కంటే రకుల్ పై ఎక్కువగా పడింది. దెబ్బకు దుకాణం సర్దేసి సైలెంట్ గా తమిళ సినిమాలు చేసుకుంటోంది. అయితే రాశిఖన్నా పరిస్థితి వేరు. తెలుగులో అంతోఇంతో క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలు తగ్గించేసింది రాశిఖన్నా.
అవును.. ఈమెకు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం ఆడకపోయినా, అంతకంటే ముందొచ్చిన తొలిప్రేమ హిట్ అయింది. అయినప్పటికీ తెలుగు ప్రాజెక్టులకు తాత్కాలికంగా విరామం ప్రకటించింది రాశిఖన్నా. షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తానంటోంది.
ఒకటి కాదు, రెండుకాదు, ఏకంగా నాలుగు తమిళ సినిమాలు ఓకే చేసింది రాశిఖన్నా. వీటిలో ఓ సినిమా ఆల్రెడీ రిలీజ్ అవ్వగా, మరో 3 షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ 3 కాకుండా, త్వరలోనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సెట్స్ పై ఉన్న 3 సినిమాలతో పాటు, త్వరలోనే ప్రారంభం కాబోతున్న నాలుగో సినిమా కూడా పూర్తిచేసి, అప్పుడు తిరిగి టాలీవుడ్ కు రావాలనుకుంటోంది ఈ బ్యూటీ. నిజానికి హీరోయిన్లకు టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. ఎక్కడ అవకాశాలు, ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూపోతారు.
సేమ్ టైం, కాస్త ప్లానింగ్ తో ముందుకెళ్లేవారు ఏదో ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. లేదంటే రకుల్ ప్రీత్ సింగ్ లా అటుఇటు కాకుండా కెరీర్ చాలించాల్సి వస్తుంది.